ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు(Super Subbu)’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 2 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

కథా నేపథ్యం ఏంటి?

ఈ సిరీస్ అంతా ‘మాకీపూర్’ అనే ఒక ఊహాజనిత గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఏ టీచర్ కూడా వెళ్లడానికి ఇష్టపడని ఆ గ్రామానికి సుబ్రహ్మణ్యం అలియాస్ ‘సుబ్బు’ (సందీప్ కిషన్) అనే ఉపాధ్యాయుడు బదిలీ అవుతాడు. తన కుటుంబం ముందు పరువు నిలబెట్టుకోవడానికి అక్కడికి వెళ్లిన సుబ్బుకు ఊహించని షాక్ తగులుతుంది. అతనికి అక్కడ 'సెక్స్ ఎడ్యుకేషన్' (లైంగిక విద్య) బోధించే బాధ్యతను అప్పగిస్తారు గ్రామస్థులు.

అసలే అనుభవం లేని సుబ్బు, ఆ క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెట్టాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది నవ్వులు పూయిస్తుంది. అక్కడ అడిగే ప్రతి ప్రశ్నా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది, ప్రతి పుకారు క్షణాల్లో ఊరంతా వ్యాపిస్తుంది. ఎలాంటి అనుభవం లేకపోయినా, మంచి ఉద్దేశంతో సుబ్బు ఆ గ్రామస్థులకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అనేక తప్పుల తడకలు, అపార్థాలు, వింత స్నేహాలు అతనికి ఎదురవుతాయి. సుబ్బు ఆ ఊరిని మార్చాలని అనుకుంటాడు కానీ, చివరికి ఆ ఊరే అతడిని ఎలా మార్చేసింది అనేదే అసలు కథ.

నటీనటులు ఏమన్నారంటే?

సందీప్ కిషన్ (సుబ్బు పాత్రధారి):

"జనాలు సాధారణంగా మాట్లాడటానికి వెనుకాడే ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ సిరీస్‌లో కామెడీ, భావోద్వేగాలతో చూపించాము. సుబ్బు అనే క్యారెక్టర్ ఒక సమస్యను పరిష్కరించాలని చూస్తే, దానికి బదులు మరో ఐదు కొత్త సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగ సమస్యలు, లవ్ ఫెయిల్యూర్స్, తండ్రి ముందు పరువు కాపాడుకునే ప్రయత్నాలు.. ఇలా సుబ్బు ఎప్పుడూ ఏదో ఒక గొడవలో చిక్కుకుంటూనే ఉంటాడు. కానీ అతని మనసు చాలా మంచిది. మాకీపూర్ గ్రామంలోని వింత మనుషులు, వారి మధ్య వచ్చే అపార్థాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. నెట్‌ఫ్లిక్స్ మొదటి తెలుగు ఒరిజినల్ సిరీస్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది."

మిథిలా పాల్కర్ (ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రధారి):

"ఈ సిరీస్‌లో కేవలం నవ్వించడమే కాకుండా, మనుషుల మధ్య ఉండే బంధాలు, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని చక్కగా చూపించారు. దర్శకుడు మల్లిక్ రామ్ సృష్టించిన ఈ మాకీపూర్ ప్రపంచం చాలా కొత్తగా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. గతంలో నేను నెట్‌ఫ్లిక్స్ మొదటి హిందీ సిరీస్ 'లిటిల్ థింగ్స్' లో నటించాను, ఇప్పుడు వారి మొదటి తెలుగు సిరీస్‌లో కూడా నటించడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది."

మురళీ శర్మ (సుబ్బు తండ్రి - కుకటేశ్వరరావు):

"సమాజంలో దాచే విషయాలపై నవ్వుతూనే ఆలోచింపజేసే కథ ఇది. ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్, కామెడీల కలయికతో ఈ సిరీస్ సాగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కథకు సులభంగా కనెక్ట్ అవుతారు. ఇంత మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది."

సాంకేతిక వర్గం

ఈ సిరీస్‌ను మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబల్ కలిసి రచించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌లో గెటప్ శ్రీను, మానస చౌదరి, జీవన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించి మరిన్ని నవ్వులు పంచనున్నారు. జూలై 2 నుంచి ఈ వినోదాత్మక సిరీస్ మీ నెట్‌ఫ్లిక్స్ స్క్రీన్స్‌పై సందడి చేయనుంది.

Lipika Varma

Lipika Varma

Next Story