Director K. Bhagyaraj: తమిళ చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం .. దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

Director K. Bhagyaraj: తమిళ సినిమా రంగాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు భారతీరాజా మరణించిన కొద్ది రోజులకే.. ఆయన శిష్యుడు, తమిళ చిత్ర పరిశ్రమలో 'వన్-మెన్ స్టూడియో'గా పేరొందిన సీనియర్ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు (Cardiac Arrest) కారణంగానే ఆయన చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్‌లో భాగ్యరాజ్ కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. సాధారణ మధ్యతరగతి కథలను, కుటుంబ భావోద్వేగాలను, చక్కటి హాస్యాన్ని జోడించి సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, ఆయనే దర్శకత్వం వహిస్తూ.. మళ్లీ ఆయనే హీరోగా నటించి మెప్పించడం భాగ్యరాజ్ ప్రత్యేకత. ఆయన అందించిన 'ముంధానై ముడిచ్చు' (తెలుగులో 'మూడు ముళ్లు'), 'అన్ధ 7 నాట్కళ్' (తెలుగులో 'రాధా కళ్యాణం'), 'మౌన గీతాలు', 'చిన్నవీడు' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి.
భాగ్యరాజ్ భార్య పూర్ణిమా జయరామ్ కూడా ఒకప్పటి ప్రముఖ నటి. వీరికి శరన్య, శాంతను అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు శాంతను భాగ్యరాజ్ ప్రస్తుతం తమిళంలో నటుడిగా రాణిస్తున్నారు. భాగ్యరాజ్ మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు.

