Jayam Ravi: తమిళ హీరో జయం రవి ఇల్లు వేలం
జయం రవి ఇల్లు వేలం

Jayam Ravi: తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి)కు చెందిన చెన్నైలోని ఇంజాంబక్కం బంగ్లా వివాదంలో చిక్కుకుంది. ఆయన తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో, బ్యాంకు అధికారులు ఆ బంగ్లాను జప్తు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ వివాదం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో, సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. రవి మోహన్ ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకున్నారని, అయితే గత 10 నెలలుగా నెలవారీ వాయిదాలు (EMI) చెల్లించలేదని సమాచారం. ఈ కారణంగా, బ్యాంకు అధికారులు బంగ్లాకు నోటీసులు అతికించి జప్తు ప్రక్రియను ప్రారంభించారు. ఈ నోటీసులో మొత్తం రూ. 7.60 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు, టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థతో కూడా రవి మోహన్ కు ఆర్థిక వివాదాలు ఉన్నాయి. ఆ సంస్థలో రెండు సినిమాలకు గాను రూ. 6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ ఆ సినిమాల్లో నటించకుండా ఇతర ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థ కూడా రవి మోహన్ బంగ్లాను జప్తు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టులో కూడా విచారణ జరిగింది. అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని లేదా రూ. 6 కోట్లకు సంబంధించిన ఆస్తి పత్రాలను కోర్టులో సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
