Tarun Bhaskar–Eesha Rebba Wedding Rumours: తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా పెళ్లి రూమర్లకు మళ్లీ రెక్కలు.. వైరల్ అవుతున్న వినాయక చవితి పూజ ఫొటో..
వినాయక చవితి పూజ ఫొటో..

Tarun Bhaskar–Eesha Rebba Wedding Rumours: టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, టాలెంటెడ్ హీరోయిన్ ఈషా రెబ్బా వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో మరోసారి జోరుగా చర్చ మొదలైంది. వినాయక చవితి వేళ వీరిద్దరూ కలిసి జంటగా పూజలో పాల్గొనడం, ఆ ఫొటోను స్వయంగా తరుణ్ భాస్కరే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
కలసి చేసిన పూజ.. సెలబ్రిటీల శుభాకాంక్షలు
వినాయక చవితి పూజ ఫొటోలో ఈ జంట సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. తరుణ్ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వెంటనే స్పందించారు. మంచు లక్ష్మి, నటి ప్రగతి, శివాత్మిక రాజశేఖర్, షాలిని కొండెపూడి వంటి సినీ తారలు ఈ ఫొటో కింద కామెంట్లు పెడుతూ శుభాకాంక్షలు తెలపడం నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకర్షించింది. దీంతో ఇది కేవలం పండుగ శుభాకాంక్షలకే పరిమితమా లేక వారి కొత్త జీవితానికి సంబంధించిన ముందస్తు సూచనా అనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
రీల్ లైఫ్ టు రియల్ లైఫ్?
దర్శకుడు ఏఆర్ సంజీవ్ తెరకెక్కించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, కొన్నాళ్లుగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పలు సినిమా ఈవెంట్లు, పార్టీలలో వీరిద్దరూ కలిసి సందడి చేశారు. వీటన్నింటికీ మించి, తరుణ్ భాస్కర్ తల్లితో కలిసి ఈషా రెబ్బా ఎయిర్‌పోర్టుల్లో, షాపింగ్‌లలో కనిపించడంతో వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపించాయి.
అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?
గతంలో తనపై వస్తున్న ప్రేమ, పెళ్లి వార్తలపై తరుణ్ స్పందిస్తూ.. ఈషా తనకు సాధారణ స్నేహితురాలు మాత్రమే కాదని, జీవితంలో అత్యంత కీలకమైన బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలనూ తానే స్వయంగా వెల్లడిస్తానని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పండుగ పూట ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను పంచుకోవడంతో, "ఆ సరైన సమయం వచ్చేసింది.. త్వరలోనే ఈ జంట నుంచి శుభవార్త రావడం ఖాయం" అంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

