TFPC Elections: తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది! తెలుగు చిత్ర నిర్మాతల మండలి - టీఎఫ్‌పీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ తాజాగా ఒక కీలక ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. పరిశ్రమలో నిర్మాతల సంక్షేమమే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేస్తూ పలు ఆకర్షణీయమైన హామీలను ప్రకటించింది.

ఈ సమావేశంలో మాట్లాడిన సి. కళ్యాణ్.. తాము అధికారంలోకి రాగానే నిర్మాతల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మెడిక్లైమ్ మొత్తాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేవలం మెడిక్లైమ్ మాత్రమే కాకుండా, చిన్న నిర్మాతలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. నిర్మాతల పిల్లల విద్యకు, వివాహాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వృద్ధ నిర్మాతలకు పెన్షన్, మరణించిన నిర్మాతల కుటుంబాలకు తగిన ఆర్థిక భద్రతను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇక ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిస్తామని, సినీ ఆస్తుల పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు మార్కెట్ కల్పించేలా ఓటీటీ అవకాశాలు అందించేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. నిర్మాతల సమస్యల సత్వర పరిష్కారం కోసం, పరిశ్రమ సర్వత్రా అభివృద్ధి చెందేందుకు ఈసారి తమ ప్యానెల్‌కే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారు టాలీవుడ్ నిర్మాతలను కోరారు.

Next Story