Thalapathy Sensation: దళపతి సెన్సేషన్.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా విజయ్
మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా విజయ్

Thalapathy Sensation: తమిళ వెండితెరపై దశాబ్దాల కాలం పాటు తిరుగులేని దళపతిగా వెలుగొందిన జోసెఫ్ విజయ్.. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన మార్క్ చాటుతున్నారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రెండు ఏళ్ల క్రితమే పార్టీని స్థాపించి, మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలను గెలుచుకుని, తమిళ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.
విజయ్ సాధించిన ఈ రాజకీయ విజయం ఇప్పుడు ఆయన క్రేజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ IMDb విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల' తాజా జాబితాలో విజయ్ ఏకంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత వారం 21వ స్థానంలో ఉన్న ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా 19 స్థానాలు ఎగబాకి టాప్ 2లోకి చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా IMDb సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
ఇక ఈ లిస్ట్‌లో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సప్నే Vs ఎవ్రీవన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సిరీస్‌కు లభిస్తున్న ఆదరణతో అంబరీష్ వర్మ టాప్ వన్‌లోకి వచ్చారు.
మరోవైపు, సౌత్ లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి కూడా ఈ జాబితాలో తన సత్తా చాటారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన ‘ఏక్ దిన్’ చిత్రం విడుదలైన నేపథ్యంలో, సాయిపల్లవి ఈ జాబితాలో ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
సినిమా గ్లామర్‌తో మొదలైన విజయ్ ప్రస్థానం.. ఇప్పుడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును శాసించే స్థాయికి చేరింది. ఒకవైపు సినిమాల్లో రికార్డులు సృష్టిస్తూనే, మరోవైపు ప్రజానాయకుడిగా ఎదుగుతున్న విజయ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

