Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన పెద్ది'వ సినిమా వివాదంపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఆ చిత్రంలో స్త్రీ పాత్రను చిత్రీకరించిన తీరుపై, వచ్చిన విమర్శలపై ఆమె బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రంలోని కథనం లైంగిక దాడిని ప్రోత్సహించేలా ఉందని, ఆ తప్పు తన మనస్సాక్షిని నిరంతరం వేధిస్తోందని కుండబద్దలు కొట్టారు. ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో పాల్గొన్న ఆమె ఈ వివాదంపై నిర్మొహమాటంగా మాట్లాడారు.

ఆ అవమానాన్ని జీవితాంతం మోయాల్సిందే..

జూన్ 4న విడుదలైన పెద్ది చిత్రంలో జాన్వీ అచియమ్మ అనే పాత్రను పోషించారు. అయితే ఆమె పాత్ర పరిచయం, కథానాయకుడి ప్రవర్తన, ముఖ్యంగా మహిళ అంగీకారం లేకుండా ముద్దుపెట్టుకునే సన్నివేశంపై అప్పట్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జాన్వీ బదులిస్తూ.. "ఆ చిత్రం కోసం వందలాది మంది కష్టపడ్డారు, అందుకే తొలుత దీనిపై మాట్లాడకూడదని భావించాను. కానీ ఆ కథనం సమాజంపై, తోటి మహిళలపై చూపే దుష్ప్రభావం గురించి ఆలోచిస్తే నా మనస్సాక్షి నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఆ చేదు అనుభవాన్ని, అవమానాన్ని నేను జీవితాంతం మోయక తప్పదు" అని స్పష్టం చేశారు.

షూటింగ్‌లో తీవ్ర అసౌకర్యం.. ప్రశ్నించాల్సింది!"

సినిమాలోని లోపాలను ఏమాత్రం సమర్థించుకోకుండా జాన్వీ నేరుగా ఒప్పుకున్నారు. "ఆ కథనం సమస్యాత్మకమైనది. అందులో తీవ్ర అసభ్యత ఉంది. ఒక నటిగా నేను మరింత అప్రమత్తంగా ఉండి ఉండాల్సింది" అని అభిప్రాయపడ్డారు.

చిత్రీకరణ సమయాన్ని గుర్తుచేసుకుంటూ, కొన్ని సీన్లు తీస్తున్నప్పుడు తనకు మానసికంగా తీవ్రమైన హింసలా అనిపించిందని, సెట్స్‌లో ఎంతో అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు. దర్శకుడు చెప్పిన దానికి కట్టుబడి ఉంటూనే, ఆ సన్నివేశాల తీవ్రతను తగ్గించేందుకు తన వంతు ప్రయత్నించానని, పరిశ్రమలో తనకు లభించిన గుర్తింపును వాడుకుని ఆ రోజే ఆ సన్నివేశాలను గట్టిగా ఎదిరించి ఉండాల్సిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

ఆన్‌లైన్ చర్చను స్వాగతిస్తున్నా..

సమాజంలో ఇలాంటి సన్నివేశాలపై చర్చ జరగడం మంచి పరిణామమని, ఆన్‌లైన్‌లో నెటిజన్లు లేవనెత్తిన అభ్యంతరాలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని జాన్వీ పేర్కొన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విమర్శలు తీవ్రమైన సమయంలో ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వరుణ్ ధావన్, అర్జున్ కపూర్‌లతో కలిసి పాల్గొన్న ఈ తాజా టాక్ షోలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Next Story