Actor Suman: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి నటుడు సుమన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని కేవలం పదవిలా కాకుండా ఓ పెద్ద బాధ్యతలా భావిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఈ పదవికి తన పేరును సిఫార్సు చేసిన నందమూరి బాలకృష్ణకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా పరిశ్రమలోకి రావడం తన అదృష్టమని, ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ప్రేక్షకులు ఇస్తున్న ఆదరాభిమానులే తన బలం అని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని, తనకు లభించిన అరుదైన గౌరవాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమన్.. తన సుదీర్ఘ ప్రయాణ విశేషాలను పంచుకున్నారు. సినిమా రంగంలో తాను ఏకంగా 48 సంవత్సరాలుగా కొనసాగుతున్నానని తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా మొత్తం 11 భాషల్లో కలిపి దాదాపు 1000 సినిమాల్లో నటించానని, ఒక్క తెలుగులోనే హీరోగా వంద చిత్రాలు చేశానని గర్వంగా చెప్పారు. ఎన్నో పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో దేవుడి పాత్రలు పోషించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యానని గుర్తు చేసుకున్నారు.

తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ 'అన్నమయ్య'కు 29 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా విడుదలైన సమయంలో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి ఆ చిత్రాన్ని వీక్షించే అరుదైన అవకాశం తనకు దక్కిందని తెలిపారు. అంతేకాదు ఆయనతో కలిసి భజనం చేశానని..అదే భారత రత్నతో సమానమని సుమన్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story