Rakul Preet Singh: ఆ నంబర్ నాది కాదు.. బ్లాక్ చేయండి : రకుల్ ప్రీత్ సింగ్
బ్లాక్ చేయండి : రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైబర్ మోసగాళ్ల పట్ల ప్రజలను, తన అభిమానులను అప్రమత్తం చేశారు. కొందరు కేటుగాళ్లు తన పేరు, ఫొటోలను ఉపయోగించి నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా హెచ్చరిక జారీ చేశారు. రకుల్ గుర్తించిన వివరాల ప్రకారం.. 8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి కొందరు వ్యక్తులకు సందేశాలు పంపుతున్నట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, ఆ నకిలీ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. "నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి. అది నాది కాదు, వెంటనే దాన్ని బ్లాక్ చేయండి" అని ఆమె స్పష్టం చేశారు.
ఇతర నటీమణులూ బాధితులే
సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలు చేయడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. గతంలో నటీమణులు అదితి రావు హైదరి, రుక్మిణి వసంత్ పేరుతో కూడా ఇలాంటి నకిలీ వాట్సాప్ నంబర్ల ద్వారా మోసాలు జరిగాయి. అదితి రావు హైదరి స్పందిస్తూ, తన అధికారిక పనులన్నీ కేవలం టీమ్ ద్వారానే జరుగుతాయని వివరణ ఇచ్చారు.
సైబర్ నిపుణుల సూచన
సెలబ్రిటీల పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాల నేపథ్యంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని వారు తెలిపారు.

