Manushi Chhillar: అది నా జీవితంలోనే అత్యంత కఠినమైన కాలం.. మానుషి చిల్లర్ సంచలన వ్యాఖ్యలు..
మానుషి చిల్లర్ సంచలన వ్యాఖ్యలు..

Manushi Chhillar: దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లు, విద్యార్థుల నిరసనల నడుమ ఆమె తన గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.
మళ్లీ పరీక్ష రాయడం నరకప్రాయం:
నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన ఒక పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో మానుషి చిల్లర్ పాల్గొని మాట్లాడారు. 2015లో తాను నీట్ పరీక్ష రాసిన సమయంలో పేపర్ లీక్ కావడంతో, మళ్లీ 45 రోజుల పాటు రీ-ఎగ్జామ్‌కు సిద్ధం కావాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో మళ్లీ చదవడానికి నాలో ఎంత శక్తి మిగిలి ఉందో అర్థం కాలేదు. అది నా జీవితంలోనే అత్యంత ఒత్తిడితో కూడిన ఘట్టం. ఇది కేవలం నా ఒక్కదాని సమస్య కాదు, దేశంలో లక్షలాది మంది మెడికల్ ఆశావాహులు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవం" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇష్టమైనవన్నీ త్యాగం చేశా:
తన తల్లిదండ్రులు వైద్యులే అయినప్పటికీ, ఈ పోటీ పరీక్షను ఎదుర్కోవడం తనకు ఎంతో భారాన్నిచ్చిందని ఆమె అన్నారు. "పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం కోసం నాకు ఎంతో ఇష్టమైన కూచిపూడి నృత్యం, పెయింటింగ్‌లను ఏడాది పాటు పూర్తిగా పక్కన పెట్టేశాను. నా సంతోషాలన్నీ త్యాగం చేయాల్సి వచ్చింది" అని తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల నరకయాతన
దేశంలో కోచింగ్ సంస్కృతి, విద్యార్థుల కష్టాలపై స్పందిస్తూ.. "పిల్లలను పెద్ద పెద్ద నగరాలకు పంపి చదివించడానికి తల్లిదండ్రులు తమ శక్తికి మించి అప్పులు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు ఇరుకైన పీజీ గదుల్లో బంధీలై, రాత్రింబవళ్లు పుస్తకాలతోనే గడుపుతున్నారు. నాకు నా కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించింది, వ్యాయామం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకున్నాను. కానీ ప్రతి విద్యార్థికి అలాంటి వసతులు, మద్దతు లభించకపోవడం విచారకరం" అని అన్నారు.
వైద్య విద్యార్థిని నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్, వైద్య విద్య అభ్యసిస్తూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశానికి గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో బాలీవుడ్ ప్రవేశం చేసి, బడే మియా ఛోటే మియా, టెహ్రాన్ వంటి చిత్రాల ద్వారా నటిగా తనదైన ముద్ర వేశారు.

