Actress Anandi: 23 ఏళ్లకే పెళ్లి అందుకే చేసుకున్నా - ఆనంది
పెళ్లి అందుకే చేసుకున్నా - ఆనంది

Actress Anandi: తెలుగు, తమిళ భాషల్లో తన సహజమైన అందం, నటనతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకున్నారు.
రక్షిత నుంచి ఆనంది వరకు..
ఆమె అసలు పేరు రక్షిత కాగా తమిళ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు ప్రభు సాల్మన్ తన పేరును ఆనందిగా మార్చారని తెలిపారు. టీవీకి సంబంధించిన ఒక గేమ్ షో ద్వారా ఓంకార్ ఆమెను పరిచయం చేశారు. ఆ షోలో ఆమెను చూసిన దర్శకుడు మారుతి తన మొదటి సినిమా ఈ రోజుల్లోలో ఛాన్స్ ఇవ్వడంతో సినీ ప్రయాణం మొదలైంది. తెలుగులో ప్రయాణం మొదలైనప్పటికీ, ఆ తరువాత తెలుగు కంటే తమిళంలోనే తనకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని ఆనంది తెలిపారు. ఇన్నేళ్ల పాటు సినిమాలు చేస్తానని తాను అనుకోలేదని చెప్పారు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఆనంది, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ముచ్చటించారు. స్టార్ స్టేటస్ వచ్చింది కాబట్టి, అదే కేటగిరీకి చెందిన వారిని పెళ్లి చేసుకోవాలని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఒక సినిమా షూటింగ్‌లో, సెట్‌లో తన భర్త సొక్రటీస్ ను చూశానని, అప్పుడే పరిచయం మొదలైందని తెలిపారు. సొక్రటీస్ అభిప్రాయాలు, అభిరుచులు నచ్చడంతో.. 23 ఏళ్లకే పెద్దల అంగీకారంతో వారి పెళ్లి జరిగిందని ఆనంది వెల్లడించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
వరంగల్‌కు చెందిన ఈ ప్రతిభావంతురాలు తన సహజమైన అందం, విలక్షణమైన పాత్రల ఎంపికతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.

