Lokesh Kanagaraj Clarifies: రజనీ - కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నాను.. లోకేశ్ కనగరాజ్ క్లారిటీ
లోకేశ్ కనగరాజ్ క్లారిటీ

Lokesh Kanagaraj Clarifies: తమిళ సినీ రంగంలోని ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ సుమారు 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించాల్సిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హఠాత్తుగా తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ లోకేశ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సూపర్ స్టార్ల సినిమా నుంచి తానెందుకు వైదొలిగారో వివరించారు.
లోకేశ్ వివరణ
కూలీ షూటింగ్ సమయంలోనే రజనీ, కమల్ కలిసి సినిమా చేసే ఆలోచన తన ముందుకు వచ్చిందని 46 ఏళ్ల తర్వాత వారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం ఒక గౌరవంగా భావించానని లోకేశ్ తెలిపారు. ఇప్పటికే ఖైదీ 2 కమిట్‌మెంట్ ఉన్నా, ఈ సినిమా కోసమే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. ఒకటిన్నర నెలల పాటు కష్టపడి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్‌ను లోకేశ్ సిద్ధం చేశారు. అయితే రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 వంటి యాక్షన్ చిత్రాలు చేస్తుండగా, కమల్ హాసన్ కూడా అన్బరివు దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు.
ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాలు చేయడం ఎందుకని ఒక లైట్ హార్టెడ్ సినిమా చేయాలని భావించారు. కానీ, లోకేశ్ కనగరాజ్ తన శైలికి భిన్నమైన అటువంటి చిత్రాలను తీయలేనని, అందుకే నిజాయతీగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. తన గత చిత్రం కూలీపై వచ్చిన విమర్శల గురించి కూడా ఆయన మాట్లాడారు. సినిమా 35 రోజుల పాటు ఆడి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని సన్ పిక్చర్స్ వెల్లడించిందని, వచ్చిన విమర్శల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటానని తెలిపారు.

