Malavika Mohanan: దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నటి మాళవిక మోహనన్‌. ఇటీవల సర్దార్‌ 2తో సందడి చేసిన ఈ భామ, ప్రస్తుతం విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాకెట్‌ నోవెల్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అనుభవాలను, ఆ చిత్ర బృందంతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కేవలం కథే కాదు.. తోటి మనుషులూ ముఖ్యమే

ఒక సినిమాలో నటించడమంటే కేవలం కెమెరా ముందు పాత్ర పోషించడం మాత్రమే కాదని, ఆ ప్రయాణంలో మనతో కలిసి పనిచేసే తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులే అత్యంత కీలకమని మాళవిక పేర్కొన్నారు. ‘‘కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు అవే మనకో ప్రత్యేక ప్రపంచంగా మారిపోతాయి. పాకెట్ నోవెల్ కూడా నాకు అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. ఒక టీమ్‌తో నెలల తరబడి నిరంతరం పనిచేస్తూ, సుదీర్ఘ గంటలు గడుపుతూ, ఎన్నో భావోద్వేగాలను పంచుకుంటాం. ఆ క్రమంలో తెలియకుండానే వాళ్లంతా మనకొక కుటుంబంలా మారిపోతారు’’ అని ఆమె వివరించారు.

విజయ్ సేతుపతితో ప్రయాణం మరువలేనిది..

ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాళవిక ప్రత్యేకంగా స్పందించారు. ‘‘విజయ్ సేతుపతి లాంటి అద్భుతమైన ప్రతిభావంతుడితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ జర్నీని ఆయనతో కాకుండా మరెవరితోనూ ఊహించుకోలేను. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది’’ అంటూ సహ నటుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

Next Story