Senior Actress Tabu: నన్ను నడిపించేది దర్శకుడే.. సీనియర్ నటి టబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆసక్తికర వ్యాఖ్యలు..

Senior Actress Tabu: వెండితెరపై విలక్షణ పాత్రలతో దశాబ్దాలుగా ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి టబు, తన సినీ ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ డైరెక్టర్స్ యాక్టర్ గానే కొనసాగానని, ఒక కళాకారుడి ప్రతిభను పూర్తిస్థాయిలో వెలికితీయడం ఒక్క దర్శకుడికే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. పాత్ర ప్రాధాన్యత కంటే మంచి కథ, సమర్థుడైన దర్శకుడికే తన తొలి ప్రాధాన్యం ఉంటుందని టబు పేర్కొన్నారు. "ఒక పాత్ర ఎంత బలంగా ఉన్నా, దానిని సరైన దిశలో నడిపించాల్సింది కెప్టెన్ ఆఫ్ ది షిప్పే. సినిమా విజయమైనా, వైఫల్యమైనా దానికి దర్శకుడే మూలకారణం. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచడానికే నేను ఇష్టపడతాను" అని ఆమె వెల్లడించారు.
టీనేజ్ ఎంట్రీ నుంచి స్టార్‌డమ్ వరకు..
1985లో దేవ్ ఆనంద్ చిత్రం హమ్ నౌజవాన్ తో టీనేజ్‌లోనే కెమెరా ముందుకు వచ్చిన టబు, 1991లో విక్టరీ వెంకటేష్ సరసన కూలీ నెం. 1తో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1994లో వచ్చిన హిందీ సినిమా విజయ్‌పథ్ ఆమె కెరీర్‌కు భారీ బ్రేక్ అందించింది.
దృశ్యం 3తో రాబోతున్న మీరా దేశ్‌ముఖ్..
ప్రస్తుతం టబు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దృశ్యం 3: ది కన్‌క్లూజన్. ఇందులో ఆమె మరోసారి పవర్‌ఫుల్ మాజీ ఐజీ మీరా దేశ్‌ముఖ్ పాత్రలో మెప్పించనున్నారు. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ప్రకాశ్ రాజ్, జైదీప్ అహ్లావత్, శ్రియా శరణ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

