ఆకట్టుకుంటున్న 'VISA - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్
జూలై 12న టైటిల్ టీజర్ విడుదల

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా'.
'VISA - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త యూత్‌ఫుల్ రైడ్‌ను వాగ్దానం చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను మరియు మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించనుంది.
యువత మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం విదేశాల్లోని విద్యార్థి జీవితంలోని ఎత్తుపల్లాలను ప్రతిబింబిస్తుంది. చదువు, సాంస్కృతిక మార్పులు, ప్రేమ, భావోద్వేగం ఇలా ప్రతి అంశాన్ని సృజిస్తూ ఈ తరానికి నచ్చేలా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.
హృద్యమైన కథతో రూపొందుతోన్న ఈ యూత్‌ఫుల్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
'VISA - వింటారా సరదాగా' ప్రపంచంలోకి ప్రేక్షకులకు తీసుకెళ్లేలా ఈ చిత్రం యొక్క టీజర్ జూలై 12న ఉదయం 10:53 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని.. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.
