Taapsee Pannu: సినీ పరిశ్రమలో తెరవెనుక జరిగే పక్షపాతం, నటీమణులు ఎదుర్కొనే వివక్షపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మరోసారి గళం విప్పారు. తన కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్‌లో ఎదురైన అవమానకర, వింత అనుభవాలను ఇటీవల నయన్‌దీప్ రక్షిత్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్ర పరిశ్రమలో ఎదురైన వింత కారణాలు

సినిమా ఖరారై, అధికారికంగా సంతకం చేసిన తర్వాత కూడా తనను నిర్దాక్షిణ్యంగా తప్పించిన సందర్భాలను తాప్సీ బయటపెట్టారు. ఒక ప్రాజెక్ట్ నుంచి తనను తొలగించినప్పుడు కారణం అడగ్గా, సదరు కథానాయకుడి భార్యకు తను నచ్చలేదనే సమాధానం ఎదురైందని ఆమె గుర్తుచేసుకున్నారు. "ఆమెకు నేనెందుకు నచ్చలేదో ఇప్పటివరకు నాకైతే అర్థం కాలేదు" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే వివాదాలకు తావివ్వకుండా ఆ హీరో, ఆయన భార్య పేర్లను మాత్రం ఆమె గోప్యంగా ఉంచారు. మరో ప్రాజెక్ట్‌లో ఓ ప్రముఖ నటుడు తనతో బాగా సన్నిహితంగా ఉండే వేరొక హీరోయిన్‌కు అవకాశం ఇప్పించడం కోసం తనను ఆ చిత్రం నుంచి అర్ధాంతరంగా తొలగించారని తెలిపారు.

టైప్‌కాస్ట్ పై తాప్సీ స్పష్టత

చిత్ర పరిశ్రమలో నటీనటులను ఒక నిర్దిష్ట చట్రంలో బంధించే ధోరణిపై కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. కొందరిని కేవలం గ్లామర్ పాత్రలకే, మరికొందరిని సీరియస్ పాత్రలకే పరిమితం చేసే పరిస్థితి పరిశ్రమలో ఉందని పేర్కొన్నారు. తన ప్రతిభను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే పలు ఆఫర్లను సైతం సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఎదురుదెబ్బలను అధిగమించి విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. ఇటీవల అస్సి, గాంధారి చిత్రాల్లోని తన అద్భుత నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

Next Story