Salman Khan’s Shocking Comments: ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Salman Khan’s Shocking Comments: వెండితెరపై తన కండలతో విలన్లను మట్టికరిపించే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నిజ జీవితంలో తాను పోరాడుతున్న భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి అభిమానులకు షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. తాను అనుభవిస్తున్న నొప్పిని తట్టుకోలేక కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పి సినీ ప్రపంచాన్ని కలచివేశారు. ప్రముఖ బాలీవుడ్ నటీమణులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న 'టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' అనే టాక్ షోకు అతిథిగా హాజరైన సల్మాన్, ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
తాను ట్రైజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన నరాల వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. "ఈ వ్యాధి వల్ల కలిగే నొప్పిని మాటల్లో వర్ణించలేం. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవి. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం" అని సల్మాన్ భావోద్వేగంతో తెలిపారు.
ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే?
ట్రైజెమినల్ న్యూరల్జియా అనేది ముఖ భాగంలోని నరాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక నాడీ సంబంధిత రుగ్మత. దీనివల్ల ముఖంపై మెరుపులాంటి, భరించలేని నొప్పి కలుగుతుంది. బ్రష్ చేయడం, తినడం, మాట్లాడటం వంటి చిన్న పనులు కూడా ఈ వ్యాధిగ్రస్తులకు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. సల్మాన్ చాలా కాలంగా ఈ సమస్యతో పోరాడుతున్నట్లు వివరించారు.
కెరీర్ ఒడిదొడుకులు
ఒకవైపు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్, మరోవైపు కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఆయన హీరోగా నటించిన 'సికిందర్' వంటి భారీ అంచనాల చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం ఆయన 'గాల్వన్' అనే చిత్రంలో నటిస్తున్నారు.
