అసలు కారణాలు ఇవే : మాధురీ దీక్షిత్

Madhuri Dixit: ఒకప్పుడు వినోదానికి ఏకైక చిరునామా థియేటర్. కానీ నేడు ఓటీటీల రాకతో సమీకరణాలు మారిపోయాయి. ఈ మార్పులపై మాధురీ దీక్షిత్ స్పందిస్తూ.. ప్రేక్షకులు థియేటర్లకు దూరంకావడానికి ప్రధానంగా మూడు కారణాలను ఎత్తి చూపారు.

భారంగా మారుతున్న టికెట్ ధరలు

"సినిమా బాగుంటే జనం రావడం లేదనడం తప్పు. కానీ ఇప్పుడు ఒక సామాన్య కుటుంబం థియేటర్‌కు వెళ్లాలంటే అది పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. టికెట్ ధరలు, ఆహార పదార్థాల రేట్లు చూస్తుంటే.. ఏ సినిమాకు వెళ్లాలి? ఏది వదిలేయాలి? అని ప్రేక్షకులు బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది" అని మాధురి అభిప్రాయపడ్డారు.

సమయం లేకపోవడం

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 గంటలు అవుతోందని, ఆ తర్వాత మళ్లీ థియేటర్‌కు వెళ్లే ఓపిక చాలా మందికి ఉండటం లేదని ఆమె విశ్లేషించారు. అందుకే జనం వారాంతాల్లో మాత్రమే బయటకు రావడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు.

ఓటీటీ సౌలభ్యం

"ఓటీటీలు వినోదాన్ని మన చేతివేళ్ల వద్దకు తెచ్చాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి మనకు నచ్చిన సమయంలో సినిమా చూసే వీలుంది. పైగా థియేటర్లో కొనే పాప్‌కార్న్ కంటే ఇంట్లో తక్కువ ఖర్చుతో సినిమాను ఆస్వాదించవచ్చు. ఈ సౌకర్యం ప్రేక్షకులను ఓటీటీల వైపు మళ్ళిస్తోంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

సినిమా భవిష్యత్తుపై ధీమా

పరిస్థితులు మారినప్పటికీ సినిమా భవిష్యత్తుకు వచ్చిన ముప్పేమీ లేదని మాధురి స్పష్టం చేశారు. "సినిమా అనేది ఒక ఎమోషన్. ప్రేక్షకులకు థియేటర్ అనుభవాన్ని మరింత మెరుగ్గా, అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను సవరించగలిగితే.. మళ్లీ పాత రోజులు కచ్చితంగా వస్తాయి" అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story