Swara Bhasker: నీట్ పరీక్షల పేపర్ లీక్, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆమెమాట్లాడుతూ.. ఈ నిరసనలపై హిందీ చిత్ర పరిశ్రమ ఎందుకు మౌనంగా ఉందో వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నన్ను చూసి భయపడుతున్నారు..

2011 నాటి అన్నా హజారే ఉద్యమానికి బాలీవుడ్ ప్రముఖులు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు స్వర భాస్కర్ ఘాటుగా స్పందించారు. "నా పరిస్థితి చూసి వారు భయపడుతున్నారు. రాజకీయాలపై నోరు విప్పితే స్వర భాస్కర్‌కు పట్టిన గతే తమకూ పడుతుందని, చిత్ర పరిశ్రమలో ఇబ్బందులు ఎదురవుతాయని సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు.

2011 నాటి పరిస్థితులకు, ఇప్పటికీ చాలా తేడా ఉంది

ప్రస్తుత రాజకీయ వాతావరణంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. "2011 నాటి ప్రభుత్వం వేరు. అప్పట్లో తప్పులు జరిగి ఉండవచ్చు కానీ, ఈ ప్రభుత్వం వెళ్తున్నంత దూరం వారు వెళ్లలేదు. నేడు కారణం లేకుండా యాక్టివిస్టులను, విద్యార్థులను బెయిల్ ఇవ్వకుండా ఏళ్ల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. 84 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి జైలులోనే మరణించేలా చేసిన ఈ ప్రభుత్వం.. అహంకారం, బరితెగింపుతో దిగజారిపోయింది" అని ఆరోపించారు.

నా కూతురి భవిష్యత్తు కోసమే వచ్చా

తాను ఇక్కడికి సెలబ్రిటీగా కాకుండా ఒక పౌరురాలిగా, ఒక తల్లిగా వచ్చానని స్వర భాస్కర్ స్పష్టం చేశారు. "ఈ నిరసన నా కూతురి భవిష్యత్తుకు కూడా సంబంధించింది. దేశంలో పరిస్థితులు బాగోలేవని దుబాయ్ గోల్డెన్ వీసా తీసుకుని వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు. నా కూతురు ఇదే దేశంలో పెరిగి, చదువుకోవాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలో న్యాయం ఉంటే ప్రజలే పోరాడతారని, సెలబ్రిటీల మద్దతుతోనే అది పెద్దది కాదని ఆమె అన్నారు. కాగా సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్లకు ఇప్పటికే నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, రత్నా పాఠక్ షా, జీనత్ అమన్, సోనాక్షి సిన్హా వంటి పలువురు ప్రముఖులు కూడా మద్దతు పలికారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story