Arjun Das: నన్ను తీసేస్తేనే సినిమా చేస్తామన్నారు.. కానీ డైరెక్టర్ నిలబడ్డాడు - అర్జున్ దాస్ ఎమోషనల్
అర్జున్ దాస్ ఎమోషనల్

Arjun Das: దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ దాస్, తన తాజా చిత్రం ఒన్స్ మోర్ వేదికగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అదితి శంకర్‌తో కలిసి ఆయన నటించిన ఈ తమిళ రొమాంటిక్ డ్రామా ట్రైలర్ లాంచ్ వేడుకలో మాట్లాడిన ఆయన, సినిమా ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న సవాళ్లను బయటపెట్టారు. దర్శకుడు విఘ్నేశ్ శ్రీకాంత్ చాలా కాలం క్రితమే దర్శకుడు సూర్య నారాయణ్ ద్వారా తనను కలిసి ఈ కథను వినిపించారని, విన్న వెంటనే కథలోని భావోద్వేగాలు తనకు ఎంతగానో నచ్చాయని అర్జున్ దాస్ తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు విఘ్నేశ్ పలు నిర్మాణ సంస్థలను సంప్రదించగా, చాలామంది నిర్మాతలు హీరోగా అర్జున్ దాస్‌ను మారిస్తేనే ప్రాజెక్ట్ మొదలుపెడతాం అని తేల్చిచెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఎన్ని పెద్ద సంస్థలు హీరోను తొలగించాలని ఒత్తిడి తెచ్చినా దర్శకుడు మాత్రం వెనక్కి తగ్గకుండా, ఈ కథను అర్జున్ దాస్‌తోనే తెరకెక్కిస్తానని గట్టిగా నిలబడ్డారని నటుడు కృతజ్ఞతతో వెల్లడించారు. ఎంతోకాలం నిరీక్షించిన తర్వాత, దర్శకుడి విజన్‌ను పూర్తిగా విశ్వసించిన నిర్మాత యువరాజ్ గణేశన్ ముందుకు రావడంతో ఈ సినిమా పట్టాలెక్కిందని అర్జున్ దాస్ వివరించారు.
మిలియన్ డాలర్ స్టూడియోస్ బ్యానర్‌పై యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ ఒన్స్ మోర్ చిత్రంలో సోనా ఓలికల్ కీలక పాత్ర పోషించగా, అరవింద్ విశ్వనాథన్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. హృదయం, హాయ్ నాన్న చిత్రాలతో గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

