Tollywood Actor Nara Rohith: వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నారా రోహిత్ ఇంట్లో ఉగాది లాంటి సంబరం నెలకొంది. ఆయన భార్య శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వారసుడి రాకతో నారా కుటుంబంలో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రతినిధి 2 పరిచయం.. పెళ్లయిన ఏడాదికే వారసుడు..

నారా రోహిత్, శిరీషలది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ప్రతినిధి 2 సినిమాలో కలిసి నటించిన సమయంలో వీరి మధ్య చిగురించిన పరిచయం, ప్రేమగా మారింది. పెద్దల సమక్షంలో 2024 అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకోగా, ఆ తర్వాత 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై వధూవరులను దీవించారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఏడాదిలోపే తమ ప్రేమకు గుర్తుగా బాబు పుట్టడంతో రోహిత్ ఫ్యామిలీలో సంతోషం రెట్టింపైంది.

కెరీర్ పరంగానూ డబుల్ ధమాకా..

మొదటి నుంచి కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు నారా రోహిత్. ఇటీవల ఆయన నటించిన సుందరకాండ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌లోనే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ రోహిత్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

భారీ ప్రాజెక్ట్: విక్టరీ వెంకటేష్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం'లో రోహిత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. దీనితో పాటు సోలో హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇలా ఒకవైపు తండ్రిగా ప్రమోషన్ పొంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తూనే, మరోవైపు వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతూ నారా రోహిత్ ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story