నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత

Telugu film industry: సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి (83) శనివారం రాత్రి కన్నుమూశారు. కుషాయిగూడ ప్రథమపురి కాలనీలో నివసిస్తున్న ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నెలరోజుల క్రితమే ఆయన కొడుకు కూడా గుండెపోటుతోనే చనిపోయాడు. కుమారుడిని కోల్పోయిన బాధతో మానసికంగా కృంగిపోయిన ఆయన, ఆ బెంగతోనే గుండెపోటుకు గురై మరణించినట్లు తెలుస్తోంది. 1943, జనవరి 1న జన్మించిన రఘునాథరెడ్డి ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడ నివాసి. 1964లో రైల్వేలో క్లర్క్‌‌‌‌‌‌‌‌గా చేరారు. ఉద్యోగం చేస్తూనే పలు నాటకాల్లో నటించారు.

త్యాగరాయ గానసభలో ఆయన వేసిన ఓ నాటకం చూసిన పరుచూరి బ్రదర్స్‌‌‌‌‌‌‌‌... శోభన్ బాబు హీరోగా తాము తెరకెక్కిస్తున్న ‘సర్పయాగం’ సినిమా కోసం ఎంపిక చేశారు. అలా 1991లో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రఘునాథ్ రెడ్డి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 370కి పైగా చిత్రాల్లో నటించారు. చీమలదండు, ఒరేయ్ రిక్షా చిత్రాలు ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టర్నింగ్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. 1995 నుంచి 2005 వరకు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. కలిసుందాం రా, ఇంద్ర, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం లాంటి పలు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలతోపాటు నెగిటివ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లోనూ అలరించారు. 2008లో హార్ట్ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ రావడం, ఆ తర్వాత మరో రెండు సార్లు మైల్డ్ స్ట్రోక్ రావడంతో క్రమంగా సినిమాలు తగ్గించారు. తెలుగులో ఆయన చివరిగా 2018లో సుమంత్ హీరోగా వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురంలో’ సినిమాలో నటించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, బోజ్ పురి సినిమాల్లో కూడా రఘునాథ్ రెడ్డి నటించారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story