Young Actress Sanchita: ఇండస్ట్రీలో విషాదం.. యువ నటి సంచిత ఆత్మహత్య..
యువ నటి సంచిత ఆత్మహత్య..

Young Actress Sanchita: ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను, సహ నటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా పలు టీవీ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటి సంచిత ఉగలే (22) ముంబైలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ముంబై శివారు ప్రాంతమైన నాలాసోపరాలోని తన నివాసంలో.ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో ధృవీకరించారు.
గదిలోనే విగతజీవిగా.. అసలేం జరిగింది?
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. జూన్ 14వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల మధ్య సంచిత తన గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా, ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. అది చూసి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
డిప్రెషనే కారణమా? ఇన్‌స్టా పోస్ట్‌పై సస్పెన్స్..
సంచిత గత కొంతకాలంగా తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె చనిపోవడానికి కేవలం కొన్ని గంటల ముందు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంతో ఉల్లాసంగా, నవ్వుతూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. కొన్ని గంటల ముందే అంత యాక్టివ్‌గా ఉన్న నటి.. అంతలోనే అంతిమ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణాలు ఏంటనేది సస్పెన్స్‌గా మారింది.
కుంకుమ్ భాగ్య నటిగా గుర్తింపు..
సంచిత ఉగలే చాలా చిన్న వయసులోనే బుల్లితెరపై మంచి ఆఫర్లు దక్కించుకున్నారు.సూపర్ హిట్ సీరియల్ కుంకుమ్ భాగ్య, వాగ్లే కీ దునియా, దిల్వాలీ దుల్హా లే జాయేంగే
వంటి పాపులర్ షోలలో నటించి మెప్పించారు. వీటితో పాటు ఛావా అనే చిత్రంలోనూ ఆమె ఒక పాత్ర పోషించారు. ఇంతలోనే కెరీర్ ఆరంభంలోనే ఆమె ఇలా తనువు చాలించడంతో టీవీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు..
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి గల అసలు కారణాలను, వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులను, అలాగే షూటింగ్‌లో ఆమెతో పనిచేసిన సహోద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు.

