“Fauji” Film Unit: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర యూనిట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన కారు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వాహనం నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ టీమ్‌కు చెందిన రామరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. వాహనంలో ఉన్న మరో ఐదుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి సమీప ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో ఇలాంటి విషాదం జరగడంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అతి వేగమే ప్రమాదానికి కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమా సెట్స్‌లో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మృతి చెందిన రామరాజు కుటుంబానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story