తీవ్ర విషాదం

Allari Naresh’s Family: ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి, నటుడు అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేష్‌ల తాతగారైన ఈవీవీ వెంకట్రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు అల్లరి నరేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
వెంకట్రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా, వెంకట్రావు సతీమణి వెంకటరత్నం 2019లో మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఈవీవీ వెంకట్రావు పెద్ద కుమారుడు, టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ 2011 జనవరి 21న మృతి చెందారు. సరిగ్గా తన పెద్ద కుమారుడి వర్ధంతికి ఒక రోజు ముందే వెంకట్రావు మరణించడం ఆ కుటుంబంలో మరింత వేదనను నింపింది. సొంత ఊరిలో ఎంతో గౌరవప్రదంగా జీవించిన ఆయన మరణం కోరుమామిడి గ్రామంలో విషాద ఛాయలు నింపింది. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

