జెన్ Z ప్రేమలో భావోద్వేగాలు తగ్గాయా? తుషార్ కపూర్ (Tusshar Kapoor) షాకింగ్ కామెంట్స్. తన కొడుకు పెంపకం, కెరీర్ రీఎంట్రీపై ఆసక్తికర విషయాలు మీ కోసం.

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ (Tusshar Kapoor) ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొత్త సినిమా Welcome To The Jungle, తన కెరీర్, కొడుకు పెంపకం, జెన్ Z, జెన్ ఆల్ఫా పిల్లల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Welcome To The Jungle సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదల కావడమే తనకు పెద్ద విజయంగా అనిపించిందన్నారు. 30 మందికిపైగా నటీనటులతో సినిమా తెరకెక్కించడం చాలా కష్టమైందన్నారు. దర్శకుడు అహ్మద్ ఖాన్ అందరి డేట్స్ కలిపి షూటింగ్ చేయడంతో సినిమా పూర్తవ్వడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. సరదాగా దీనిని "కామెడీ ముగల్-ఎ-ఆజమ్" అని కూడా పిలిచానని చెప్పారు.
ఇంత పెద్ద మల్టీస్టారర్ సినిమాను నిర్మించడం అంత సులభం కాదన్నారు. ప్రతి నటుడికి మంచి పాత్ర దక్కేలా దర్శకుడు, రచయిత ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. అందుకే ప్రేక్షకులు సినిమాలో ప్రతి పాత్రను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. సినిమాను చూసినవాళ్లు ఇది మంచి స్ట్రెస్ బస్టర్ అని చెప్పడం తనకు చాలా ఆనందం కలిగించిందన్నారు. కామెడీ ఎక్కువగా ఉన్నా, పాత్రల భావోద్వేగాలు నిజాయితీగా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు. ఈ సినిమాలో తాను మేనేజర్ పాత్ర పోషించానని చెప్పారు. నటుల మేనేజర్లు ఎప్పుడూ కొత్త అవకాశాలు రావాలని కోరుకుంటారని, ఈ విషయాన్ని తాను కూడా దగ్గరగా చూసానన్నారు.
ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద టాలెంట్ ఏజెన్సీలు పెరిగినా, తాను మాత్రం ఒకే వ్యక్తిగత మేనేజర్‌తో పనిచేయడానికే ఇష్టపడతానని చెప్పారు. ఒక వ్యక్తితో నమ్మకం, అనుబంధం ఉంటుందని, పెద్ద ఏజెన్సీల్లో వందల మంది క్లయింట్లలో ఒకరిగా మారాలని తనకు అనిపించదన్నారు. తాజాగా తన కొడుకుతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తన కొడుకు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రతిరోజూ ఫుట్‌బాల్ ఆడుతుంటాడని, ఎక్కువగా డిఫెండర్‌గా ఆడినా గోల్స్ కూడా బాగా చేస్తాడని తెలిపారు.
ఇప్పటి పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ లేదా స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారని చాలామంది అంటుంటారు. కానీ తన కొడుకు మాత్రం బయట ఆడుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాడన్నారు. ఫుట్‌బాల్, ఇతర క్రీడల్లో చురుకుగా పాల్గొంటాడని చెప్పారు. జెన్ ఆల్ఫా పిల్లల తండ్రిగా జెన్ Z గురించి తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ప్రతి తరం ప్రత్యేకత వేరని అన్నారు. అయితే జెన్ Zలో కొంతమంది సంబంధాల్లో భావోద్వేగాలను తగ్గించుకుంటున్నారని తనకు అనిపిస్తోందన్నారు. అయితే అందరూ అలానే ఉంటారని మాత్రం చెప్పలేమని స్పష్టం చేశారు.
ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని చెప్పారు. పిల్లల పెంపకంలో ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా అవసరమని, నేటి తల్లిదండ్రులు ఆ బాధ్యతను బాగా నిర్వర్తించాలని అభిప్రాయపడ్డారు. తన కొడుకు చదువులో కూడా చాలా బాగా రాణిస్తున్నాడని చెప్పారు. క్రీడల్లోనూ మంచి ప్రతిభ చూపిస్తున్నాడన్నారు. అయితే సినిమాలపై మాత్రం పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు. తన సినిమాల్లో చాలా తక్కువ సినిమాలే చూశాడని చెప్పారు.
ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నా, కుటుంబంతో కాకుండా తన స్నేహితులతో కలిసి సినిమాలు చూడటానికే తన కొడుకు ఇష్టపడతాడని చెప్పారు. పిల్లలకు ప్రీడమ్ ఇవ్వడం కూడా అవసరమని పేర్కొన్నారు. తన చిన్నప్పటి జీవితం గురించి మాట్లాడుతూ, అప్పట్లో బయట ఆడుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉండేదన్నారు. కానీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రం తల్లిదండ్రులే తీసుకునేవారని చెప్పారు. అమెరికాకు వెళ్లిన తర్వాతే తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అప్పుడే నటుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
తన కెరీర్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మళ్లీ మంచి దశలోకి వచ్చానని తెలిపారు. కొంతకాలం నటన అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా సినిమాలు చేశానన్నారు. OTT ప్రాజెక్టులు కూడా చేశానని చెప్పారు. ఇప్పుడు Welcome To The Jungle, Masti 4 వంటి సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నానని తెలిపారు. అక్షయ్ కుమార్ గురించి మాట్లాడుతూ, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా సమయానికి షూటింగ్ పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.
కెరీర్‌లో అవకాశాలు తగ్గినప్పుడు విమర్శలు రావడం సహజమన్నారు. అలాంటి సమయంలో మానసికంగా బలంగా ఉండాలని చెప్పారు. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకుండా తన పనిపై దృష్టి పెట్టానని తెలిపారు. సినిమాల నిర్మాణం, ఈవెంట్లు, తన కొడుకుతో సమయం గడపడం, కుటుంబ వ్యాపారంలో సహాయం చేయడం ద్వారా బిజీగా ఉన్నానన్నారు.
గత కొన్నేళ్లలో ఆధ్యాత్మికత తనలో పెరిగిందని చెప్పారు. జీవితంలో ప్రతిదీ మన చేతుల్లో ఉండదని తెలుసుకున్నానన్నారు. మంచి ఆలోచనతో ముందుకు సాగితే సరైన సమయం వచ్చినప్పుడు అవకాశాలు తప్పకుండా వస్తాయని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. సినీ కుటుంబం నుంచి వచ్చినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. కానీ ఎప్పుడూ లొంగిపోకపోవడమే తన బలం అన్నారు. మంచి, చెడు మాటలు రెండూ వస్తుంటాయని, వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకు సాగాలని యువతకు సూచించారు.
భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ Janadesh సినిమాలో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా కనిపించనున్నానని తెలిపారు. ఈ పాత్ర తనకు కొత్త అనుభవమని చెప్పారు. అలాగే మంచి పాత్ర వస్తే Dhamaal సిరీస్‌లో కూడా నటించేందుకు సిద్ధమని వెల్లడించారు. దక్షిణాది సినిమాల గురించి అడగగా ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు లేవన్నారు. అయితే మంచి కథ వస్తే తప్పకుండా దక్షిణాది సినిమాలో నటిస్తానని స్పష్టం చేశారు. చివరగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు, OTT ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇచ్చారు.

