ఆనందంతో నిహారిక పోస్ట్ వైరల్

Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకే సమయంలో రెండు రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఒకవైపు విజయవంతమైన నిర్మాతగా, మరోవైపు నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఈ రెండు ప్రయాణాలను ఎంతగా ఆస్వాదిస్తున్నారో అభిమానులతో పంచుకున్నారు. ఒకే రోజు తన రెండు ప్రపంచాలు ఒకచోట కలిశాయని, ఆ క్షణం తన మనసు ఆనందంతో నిండిపోయిందని ఆమె పేర్కొన్నారు.

ఒకే చోట నటి, నిర్మాత పాత్రలు:

నిహారిక ఇటీవల ఒక రియాలిటీ షోలో గెస్ట్‌గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమె నటిగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఆ షో షూటింగ్ జరిగిన భవనానికి పక్కనే ఆమె నిర్మాణ సంస్థ 'ది ఎలిఫెంట్ పిక్చర్స్' కార్యాలయం ఉంది. షూటింగ్ ముగిసిన వెంటనే నిహారిక నేరుగా తన ఆఫీసుకు వెళ్లి నిర్మాతగా నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ అరుదైన అనుభవం ఆమెను ఎంతగానో సంతోషపరిచిందని తెలిపారు.

ఒకదాన్ని ఎంచుకోలేను:

నిహారిక తన పోస్ట్‌లో ఇలా రాశారు.. ‘‘నటన నా ప్యాషన్ అయితే, నిర్మాతగా మారడం నా ఎదుగుదలకు కారణమైంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఇష్టమని చాలామంది అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే నేను ఒకదాన్ని ఎంచుకోలేను. ఈ విషయం ఇప్పుడే స్పష్టంగా రుజువైంది. ఒకేరోజు కెమెరా ముందు నటిగా, ఆ పక్కనే ఉన్న ఆఫీసులో నిర్మాతగా కనిపించడం నా ప్రయాణాన్ని గుర్తుచేసింది’’ అని నిహారిక చెప్పకొచ్చింది.

నిర్మాతగా తన తొలి చిత్రం కమిటీ కుర్రాళ్లుతో విజయం సాధించిన నిహారిక, ప్రస్తుతం 'మ్యాడ్' ఫేమ్ సంగీత్ శోభన్‌తో తన రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిహారిక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె రెండో సినిమాలో కూడా కీలక పాత్రలో నటించవచ్చని కొందరు ఊహిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story