Udayabhanu: బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించి హృదయభానుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు వ్యాఖ్యాతగా, నటిగా మెప్పించిన ఆమె, తొలిసారి నిర్మాతగా మారి పంచనామా అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 సెప్టెంబర్‌ 11 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు.

15 ఏళ్ల తపస్సు.. రెండు గంటలు కూడా నిద్రపోలేదు

వేదికపై మాట్లాడుతూ.. "ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకూడదని వచ్చాను, కానీ మనసులోని బాధ, ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నా" అని ఉదయభాను పేర్కొన్నారు. నిర్మాతగా మారేందుకు తాను దాదాపు 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నానని ఆమె వెల్లడించారు. "మంచి కథతో ప్రాజెక్ట్ మొదలుపెడదామని ఎంతోమందిని కలిశాను. ‘వచ్చే వారం, వచ్చే నెల’ అంటూ 15 ఏళ్లు గడిచిపోయాయి. ఎందుకు ఇంత ఆలస్యమైందో నాకే అర్థం కాలేదు. నా ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అనే ఆలోచనతో ఇన్నేళ్లుగా రోజుకు రెండు గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. ఎట్టకేలకు నా కలను నిజం చేసిన జీ5 సంస్థకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పారు.

స్టార్ హీరోల పిల్లలం కాదు.. కష్టపడి పైకొచ్చాం

తన ఎదుగుదల వెనుక ఉన్న కష్టాన్ని గుర్తుచేసుకుంటూ.. "నేనేం పెద్ద స్టార్స్ ఇంట్లో పుట్టలేదు. నాకు సొంతంగా స్టూడియోలు లేవు. కేవలం 12 ఏళ్ల వయసులోనే చేతిలో మైక్ పట్టుకుని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలో నిలబడ్డాను. నా జీవితంలో ఎన్నోసార్లు కిందపడ్డాను, కానీ ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో లేచి పరిగెత్తడం నేర్చుకున్నాను" అని ఉదయభాను స్పష్టం చేశారు. ఈ ఈవెంట్‌కు ఏ పెద్ద హీరోనైనా పిలిస్తే తప్పకుండా వచ్చేవారని, కానీ తన నిజమైన బలం, కుటుంబం ప్రేక్షకులేనని ఆమె స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.

హీరోల రెమ్యునరేషన్లపై సంచలన వ్యాఖ్యలు

ఈ సిరీస్ నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను ప్రస్తావిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పంచనామా’ కోసం కొందరు హీరోలను సంప్రదించగా, వారు ఏకంగా సిరీస్ మొత్తానికి అయ్యే నిర్మాణ వ్యయాన్ని రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేశారని తెలిపారు. చివరకు భరత్ నివాస్ ప్రధాన పాత్రలో నటించగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు.

Next Story