వీడని ఉత్కంఠ

Jana Nayagan Release: తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలపై మద్రాస్ హైకోర్టులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడటం లేదు. మద్రాస్ హైకోర్టులో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ వివాదంపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది.కోర్టు తన తుది తీర్పును సినిమా విడుదల కావాల్సిన రోజైన జనవరి 9న వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రేపు సినిమా థియేటర్లలోకి వస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చినందున, రివైజింగ్ కమిటీకి పంపామని CBFC కోర్టుకు తెలిపింది. రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని చిహ్నాల వినియోగంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే సెన్సార్ బోర్డు సూచించిన 27 కట్స్ (మార్పులు) పూర్తి చేశామని, సర్టిఫికేట్ ఇవ్వడంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారని KVN ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాపై సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి ఉందని, విడుదల ఆలస్యమైతే భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో, ఈ సినిమా విడుదలపై జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.తమిళనాడులో సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాకపోవడంతో అధికారికంగా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. అయితే, ఓవర్సీస్ (విదేశాల్లో) ఇప్పటికే సెన్సార్ పూర్తవడంతో అక్కడ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. యూకే వంటి దేశాల్లో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది.

ప్రస్తుతం అందరి కళ్లు జనవరి 9న కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఉన్నాయి. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే, అదే రోజు మధ్యాహ్నం లేదా మరుసటి రోజు నుండి సినిమా ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story