CM Vijay's Divorce Case: తమిళనాడు రాజకీయాల్లోనూ, కోలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నటుడు, టీవీకే అధినేత విజయ్‌ వ్యక్తిగత జీవిత వ్యవహారంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌తో దాంపత్య బంధానికి స్వస్తి పలకాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆయన భార్య సంగీత, తాజాగా తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.

కోర్టులో అసలేం జరిగింది?

ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టులో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్‌తో ఉన్న విభేదాలు సర్దుబాటు అయ్యే అవకాశం లేదని, బంధాన్ని రద్దు చేయడంతో పాటు తగిన భరణం, చెన్నై నీలంకరై నివాసంలో నివసించే హక్కు కల్పించాలని పిటిషన్‌లో కోరారు. పలు వాయిదాల అనంతరం ఆగస్టు 7న జరిగిన విచారణ సందర్భంగా సంగీత తరఫున కోర్టులో వాంగ్మూలం నమోదు చేశారు. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో సంగీత నిర్ణయానికి కోర్టు అనుమతించింది. ఈ కేసును విత్‌డ్రాన్ గా పరిగణిస్తూ పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. సంగీత ఉపసంహరణ నిర్ణయాన్ని విజయ్ తరఫు న్యాయవాది కూడా సమర్థించారు. అయితే, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ పిటిషన్ వేసుకునే అవకాశాన్ని కోర్టు సంగీతకు కల్పించింది.

గతంలో సంగీత చేసిన సంచలన ఆరోపణలు

1999లో వివాహబంధంతో ఒకటైన ఈ దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఫిబ్రవరిలో దాఖలు చేసిన పిటిషన్‌లో సంగీత పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయ్‌కు మరో నటితో సంబంధం ఉందని, ఆ విషయం 2021లోనే తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఆ బంధాన్ని మానుకుంటానని హామీ ఇచ్చి కూడా కొనసాగించారని ఆరోపించారు. సదరు నటితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, తనపై ఆర్థిక ఆంక్షలు విధించడం, రాకపోకలను నియంత్రించడంతో తాను, తమ పిల్లలు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తాజాగా విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అవుతున్న సమయంలో ఈ వ్యవహారం రచ్చకెక్కినప్పటికీ, హఠాత్తుగా సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story