Hanuman Ansh Telugu Release: బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రూ.300 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్న సంచలన చిత్రం హనుమాన్‌ అంశ్‌ తెలుగు విడుదలకు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాల్సిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

డీల్ రద్దు.. ప్రమోషన్లకు బ్రేక్

విశాల్‌ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని తెలుగులో తన సతీమణి సాయి సౌజన్యకు చెందిన ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై త్రివిక్రమ్‌ సమర్పించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో చిత్ర నిర్మాణ సంస్థకు, త్రివిక్రమ్‌కు మధ్య కుదిరిన వ్యాపార ఒప్పందం బెడిసికొట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ పరిణామాల ప్రభావం సినిమా ప్రచార కార్యక్రమాలపై నేరుగా పడింది. తొలుత సెప్టెంబరు 14న విడుదల కావాల్సిన తెలుగు టీజర్ ఇప్పటివరకు బయటకు రాలేదు. సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగాల్సిన టీజర్‌ లాంచ్‌ వేడుక కూడా చివరి క్షణంలో రద్దయింది.

సెప్టెంబరు 18న విడుదల సాధ్యమేనా?

ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా వైదొలిగినప్పటికీ, సినిమాను గతంలో ప్రకటించినట్లుగానే సెప్టెంబరు 18న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయనున్నారనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

బాక్సాఫీస్ వద్ద అద్భుతం: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.300 కోట్ల వసూళ్లు..

ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శోభినవ్‌ సత్యా ప్రధాన పాత్ర పోషించారు. లక్ష్మీ నారాయణ్‌ అనే సామాన్యుడు జగద్విఖ్యాత ఆధ్యాత్మిక గురువుగా మారిన ప్రయాణాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. కేవలం రూ.2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, హిందీలో తొలిరోజు కేవలం రూ.10 లక్షల కలెక్షన్లతో మొదలై.. మౌత్ టాక్‌తో ఏకంగా రూ.300 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. 2026లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం, తెలుగులో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Next Story