జన్మనిచ్చిన ఉపాసన

Upasana Gives Birth to Twins: రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవలలకు జన్మనిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఒక బాబు, ఒక పాపకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. రామ్ చరణ్ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ‘మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది. మా జీవితాల్లో మహిళలే మాకు గొప్ప బలం. ప్రతి క్షణం మా వెంట నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆదివారం ఉదయం హాస్పిటల్ దగ్గర చిరంజీవి మాట్లాడుతూ ‘చాలా చాలా సంతోషంగా ఉంది. హనుమాన్ కృప వల్ల రామ్ చరణ్, ఉపాసన జంటకు ఆడబిడ్డ, మగబిడ్డ జన్మించడంతో మా ఆనందానికి అవధులు లేవు. ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అపోలో వైద్యులకు, వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అన్నారు. కవలల రాకతో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆసుపత్రి వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మూడేళ్ల క్రితం రామ్ చరణ్. ఉపాసన దంపతులు తమ తొలి సంతానంగా కుమార్తె క్లింకారకు జన్మనివ్వగా, ఇప్పుడు కవలల రాకతో ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు.

