ఉచ్చులో ఉపేంద్ర దంపతులు..

Actor Upendra: ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసిన కేటుగాళ్లు, వారిద్దరి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేశారు. ఈ షాకింగ్ ఘటనను స్వయంగా ఉపేంద్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రజలను అప్రమత్తం చేశారు. ఉపేంద్ర భార్య ప్రియాంకకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ గురించి మాట్లాడుతూ, కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు, నంబర్లను ఫోన్‌లో ఎంటర్ చేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అవతలి వ్యక్తి చెప్పినట్లే చేయడంతో ఆమె ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన తెలిపారు.

ఉపేంద్ర వార్నింగ్..

ఈ ఘటనపై ఉపేంద్ర తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. "మా ఫోన్ నంబర్లు లేదా సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దయచేసి స్పందించవద్దు. ఎలాంటి మెసేజ్‌లు లేదా కాల్స్ వచ్చినా డబ్బు పంపొద్దు" అని ఆయన ప్రజలను కోరారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.

సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో, ఆన్‌లైన్ మోసాల పట్ల సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. మీరు ఎవరైనా తెలియని వ్యక్తులు పంపిన లింకులను క్లిక్ చేయవద్దు లేదా వారు చెప్పినట్లుగా ఫోన్‌లో ఎలాంటి సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు. ఒకవేళ అలాంటి కాల్స్ వచ్చినా, వాటిని నిర్ధారించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోకండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story