Shivarajkumar’s Sensational Comments: ఉపేంద్ర కర్ణాటక సీఎం కావాలి.. రాజకీయాలపై శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్..
రాజకీయాలపై శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్..

Shivarajkumar’s Sensational Comments: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు అటు కర్ణాటకతో పాటు ఇటు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది చిత్రంలో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్ల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తోటి నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయ్ తరహాలోనే.. ఉపేంద్ర సీఎం కావాలి..
తమిళనాడు రాజకీయాల్లో స్టార్ హీరో విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా సాధించిన ఘన విజయాన్ని, సంపాదిస్తున్న ప్రజాదరణను శివరాజ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. "పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నటుడైన విజయ్‌ను అక్కడి ప్రజలు అంతలా ఆదరించి గెలిపించినప్పుడు.. కర్ణాటకలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఉపేంద్రకు ఇక్కడి ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉపేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. నటీనటులు కేవలం సినిమాల్లో మాత్రమే ముఖానికి రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో రంగులు మార్చకుండా అత్యంత నిజాయతీగా ఉంటారని శివరాజ్ కుమార్ కొనియాడారు.
ప్రత్యక్ష రాజకీయాలపై క్లారిటీ.. పబ్లిసిటీ వద్దు..
ఇంటర్వ్యూలో తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలకు కన్నడ స్టార్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో తనకు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన తెగేసి చెప్పారు. మంచి పనులు చేయడానికి ఎప్పుడూ వార్తాపత్రికల కవరేజ్ లేదా పబ్లిసిటీ అవసరం లేదని శివరాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. చేసే పనిలో నిజాయతీ ఉంటే ప్రజలే గుర్తిస్తారని తెలిపారు. తమ రాజ్ కుమార్ కుటుంబం ఎప్పటి నుంచో ఎలాంటి మీడియా ప్రచారం కోరుకోకుండా సామాన్యులకు సేవ చేస్తోందని గుర్తు చేశారు.
తమ అభిమానులు కూడా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజంలో నలుగురికీ సాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

