Kangana Ranaut’s Candid Advice: నీ అందాన్ని వాడి మన సినిమాను ప్రమోట్ చెయ్యి.. నటికి కంగనా రనౌత్ క్రేజీ సలహా
నటికి కంగనా రనౌత్ క్రేజీ సలహా

Kangana Ranaut’s Candid Advice: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా అందులో ఒక సెన్సేషన్ ఉంటుంది. అయితే ఈసారి ఆమె వివాదాలతో కాకుండా తన సహనటిపై చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భారత్ భాగ్య విధాత. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఇటీవల సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా మారిన నటి గిరిజా ఓక్‌ను ఉద్దేశించి కంగనా చేసిన చమత్కార వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బ్లూ శారీ గర్ల్ వైరల్ ముచ్చట
గతేడాది ఒక పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లో గిరిజా ఓక్ నీలం రంగు చీరలో కనిపించారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో నెటిజన్లు ఆమెను బ్లూ శారీ గర్ల్ అని, నేషనల్ క్రష్ అని పిలవడం ప్రారంభించారు. ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగానే కంగనా స్పందిస్తూ.. "ఆ బ్లూ శారీ సంగతేంటి? నేను కూడా దాని గురించి విన్నాను" అని ఆసక్తిగా అడిగారు.
నా రూపం నా ఘనత కాదు: గిరిజా ఓక్ వినమ్రత
తనకు వచ్చిన ఈ ఊహించని క్రేజ్‌పై గిరిజా ఓక్ చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారు. "ఆ వీడియో ఎందుకు అంత వైరల్ అయిందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. చాలా మంది నా అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేశారు. కానీ నా రూపం అనేది నా సొంత ఘనత కాదు, అది నా తల్లిదండ్రుల జన్యువుల వల్ల వచ్చింది. నా అందంలో నేను కష్టపడి సంపాదించుకున్నది ఏమీ లేదు" అని ఆమె వివరించారు.
అంతేకాకుండా" దేనికైనా నేషనల్ అని ట్యాగ్ రావాలంటే ఒక సర్టిఫికెట్ ఉండాలి. కంగనా గారికి జాతీయ అవార్డులు వచ్చాయి కాబట్టి ఆమెకు ఆ గుర్తింపు సబబే. కానీ నన్ను నేషనల్ క్రష్ అనడంలో ఎలాంటి లాజిక్ లేదు" అని స్పష్టం చేశారు.
కంగనా నవ్వుల పువ్వులు..
గిరిజా ఇచ్చిన సమాధానానికి ఇంప్రెస్ అయిన కంగనా రనౌత్ నవ్వుతూ.. "నువ్వు నా సినిమాలో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నీకు ఉన్న ఈ క్రేజ్‌ను, అందాన్ని ఉపయోగించి మన సినిమాను బాగా ప్రమోట్ చెయ్యి" అంటూ సరదాగా కామెంట్ చేశారు.
జూన్ 12న విడుదల
మనోజ్ తపాడియా దర్శకత్వంలో తెరకెక్కిన భారత్ భాగ్య విధాత చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్, గిరిజా ఓక్‌లతో పాటు స్మితా తాంబే, ఇషా డే, ప్రియా బెర్డే, ఆశా షెలార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

