‘Korean Kanakaraju’: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సరికొత్త హారర్-కామెడీ సినిమా ‘కొరియన్ కనకరాజు’ (KOKA) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రేజీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను 2026 ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనుకున్నారు, కానీ షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్‌కు గాయం కావడంతో సినిమా అనుకున్న సమయానికి రాలేక ఆలస్యమైంది.

హిట్ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఒక స్టైలిష్ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ రగ్గడ్ లుక్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. చీకటిగా ఉన్న ఒక గిడ్డంగి (వేర్‌హౌస్) లో కొరియన్ గ్యాంగ్‌స్టర్స్ చుట్టూ నిలబడి ఉండగా, వరుణ్ ఒక చేతిలో రక్తం అంటిన కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని చాలా ధీమాగా కూర్చుని ఉన్నారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ కమెడియన్ సత్య ఒక కీలక పాత్రలో నవ్వులు పూయించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్, ఈ డిఫరెంట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story