Kota Srinivasarao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
హైదరాబాద్ స్వగృహంలో తుదిశ్వాస విడిచిన కోట

విలక్షణ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో కోట బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పదిహేనేళ్ళ క్రితం 2010 జూలై 21వ తేదీన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 1978వ సంవత్సరంలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళం వంటి పలు భాషల్లో దాదాపు 800 పై చిలుకు సినిమాల్లో నటించారు. దాదాపు నాలుగున్నర దశాబ్ధాల నట జీవితంలో ఆయన చేయని పాత్ర లేదు. ఎస్వీరంగారావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు ల తరం తరువాత వారి నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఎన్నో విలక్షణ పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10వ తేదీన కోట శ్రీనివాసరావు జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు ప్రముఖ వైద్యులు. కోట సిని పరిశ్రలోకి రాక ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలోనే నాటకాల్లో తీరిక లేకుండా నటించేవారు. ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ హాస్య నటుడు ఇలా మొత్తంగా 9 సార్లు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో ప్రభుత్వం తరుపున నంది పురస్కారాలు అందుకున్నారు. అంతేగాక ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం నుంచి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సైతం అందుకున్నారుసహ నటుడు బాబూమోహన్ కాంబినేషన్లో కోట శ్రీనివాసరావు చేసిన అనేక సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఆపై బాబు మోహన్ కాంబినేషన్ ఆయనలోని కామెడీ టైమింగ్ అద్భుతాలే సృష్టించిందో, వెంకటేశ్ హీరోగా వచ్చిన గణేశ్ సినిమాలో ఆయన విలనిజంతో నాటి ప్రేక్షకులను వణికించారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇడియట్ సినిమాలు కూడా మంచి పేరును తీసుకు వచ్చాయి. ఇదిలాఉంటే.. తెలుగులో ఆయన చివరగా 2023లో విడుదలైన సువర్ణ సుందరి అనే చిత్రంలో కనిపించారు. కాగా కోట శ్రీనివాసరావు తమిళంలో 30కి పైగా చిత్రాల్లో నటించగా హిందీలో 10, కన్నడలో8, మలయాళ, డక్కన్ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. అతేగాక ఆయన తెలుగులో అఖిల్ సిసింద్రీ సినిమాలో ఓరి నాయనో, గబ్బర్ సింగ్ సినిమాలో ముందుబాబులం అంటూ రెండు పాటలు సైతం పాడడం విశేషం. నాటకాలు, సినిమాలే కాకుండా కోట శ్రీనివాసరావు రాజకీయల్లోకి కూడా ప్రవేశించారు. 1999లో భారతీయ జనతాపార్టీ తరపున ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
కోట మృతిపై ప్రముఖుల సంతాపం
కోటశ్రీనివాసరావు మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు సంతాపం తెలియజేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహనరెడ్డి కోట మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎపీ, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రలు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కోట శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం తెలియజేశారు. కోట శ్రీనివాసరావు సహనటుడు బాబు మోహన్ కోట మృతి చెందడంతో కన్నూరుమున్నీరు అయ్యారు. మూడు దశ్ధాలుగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని తలచుకుని తీవ్ర ఆవేదన చెందారు. కోట మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
