Veteran Singer K. Jamuna Rani: దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ నేపధ్య గాయని కోక జమునా రాణి (88) ఈరోజు కన్నుమూశారు.

1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునా రాణి గారు, తన 7వ ఏటనే ‘త్యాగయ్య’ (1946) అనే క్లాసిక్ సినిమాతో గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1940ల నుండి 1960ల వరకు దక్షిణాది సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆమె, తన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు సింహళ భాషల్లో కలిపి ఏకంగా 6,000కు పైగా పాటలు పాడారు. 1980ల వరకు సంగీత రంగంలో చురుగ్గా ఉన్న ఆమె, మణిరత్నం దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం అందించిన ‘నాయకుడు’ సినిమాలో “నా నవ్వే దీపావళి” పాటతో మళ్లీ ప్రేక్షకులను అలరించారు.

ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చండీరాణి, దేవదాసు, సంతానం, ఆలీబాబా 40 దొంగలు, వద్దంటే పెళ్లి, బడిపంతులు, అన్న తమ్ముడు, బంగారు తిమ్మరాజు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆమె పాటలు పాడారు.

ఆమె పాడిన పాటల్లో “ఓ దేవదా”, “చెలియ లేదు” (దేవదాసు), “పద పదవే వయారి గాలిపటమా” (అభిమానం), “నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన” (బంగారు తిమ్మరాజు), “మామా మామా మామా ఏమే ఏమే భామ” (మంచి మనసులు), “సరదా సరదా సిగరెట్టు” (రాముడు భీముడు), “విరిసే చల్లని వెన్నెల” (లవకుశ) వంటివి ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచిపోయాయి.

తెలుగుతో పాటు తమిళ చిత్రసీమలో కూడా సుదీర్ఘకాలం పాటు వైవిధ్యమైన పాటలు పాడి జమునా రాణి అపారమైన ప్రజాదరణ పొందారు. ఆమె మరణంతో భారతీయ చిత్రసీమ ఒక మధురమైన గళాన్ని కోల్పోయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story