‘Ranabali’: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబలి’ టీజర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను కూడా మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘రణబలి’ అనే వీర యోధుడి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న ఆయన భార్య ‘జయమ్మ’ పాత్రలో నటిస్తున్నారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమా నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతున్నారు.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘రణబలి’ సినిమా 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా విజయ్ దేవరకొండకు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఈసారి భారీ బ్లాక్‌బస్టర్ అందుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 9న టీజర్ రిలీజ్‌తో ‘రణబలి’ ప్రమోషన్స్ అధికారికంగా మొదలుకానున్నాయి. టీజర్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో పెరిగిపోయింది.

Next Story