Vijay Sethupathi: గ్లోబల్ వేదికపై విజయ్ సేతుపతి సంచలనం.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత..
అరుదైన ఘనత..

Vijay Sethupathi: భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 23న వైభవంగా జరగనున్న 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై అవార్డును ప్రదానం చేయనున్న మొట్టమొదటి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు.
చరిత్ర సృష్టించిన మక్కల్ సెల్వన్
గతంలో 2016లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ వేదికపై ప్రజెంటర్‌గా మెరిసినప్పటికీ, ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ ప్రధాన వేదికపై ఒక భారతీయ నటుడికి ఈ అవకాశం దక్కడం ఇదే ప్రథమం. అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ - సైన్సెస్ బోర్డు సభ్యురాలు, నిర్మాత కవితా గుప్తా చొరవతో భారతీయ ప్రతిభ మరోసారి ప్రపంచ యవనికపై సత్తా చాటుతోంది. 2024లో వీర్ దాస్‌ను హోస్ట్‌గా ఎంపిక చేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.
హాలీవుడ్ బాటలో మహారాజ.. ఏ-లిస్ట్ స్టార్‌తో రీమేక్!
ఇటు అంతర్జాతీయ అవార్డుల గౌరవంతో పాటు అటు విజయ్ సేతుపతి కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ న్యూస్ వెలుగుచూసింది. ఆయన హీరోగా వచ్చి సంచలన విజయం సాధించిన 50వ చిత్రం 'మహారాజ' ఇప్పుడు హాలీవుడ్ రీమేక్‌కు సిద్ధమవుతోంది.
భారత్‌లోనే కాకుండా చైనా బాక్సాఫీస్ వద్ద ఏకంగా దాదాపు రూ. 91.65 కోట్లు కొల్లగొట్టి, గ్లోబల్ ఓటీటీలోనూ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా హాలీవుడ్ వర్గాలను సైతం ఆకర్షించింది. రీమేక్ హక్కుల కోసం ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం అధికారికంగా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ టాప్ స్టార్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. నెట్టింట హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ మెకనౌఘే పేరు వినిపిస్తుండగా, అధికారిక ప్రకటన సదరు ఏజెన్సీ నుంచే వస్తుందని నిర్మాణ వర్గాలు వెల్లడించాయి.
మణిరత్నం చిత్రంతో బిజీ
ప్రస్తుతం విజయ్ సేతుపతి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇంజి వెల్లం' అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ పురస్కార వేదికపై ప్రాతినిధ్యం, మరోవైపు హాలీవుడ్ స్థాయికి చేరిన తన చిత్ర ఘనతలతో విజయ్ సేతుపతి కెరీర్ సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది.

