Vijay Wave in Tamil Nadu: తమిళనాట విజయ్ ప్రభంజనం.. టాలీవుడ్ హీరోల క్రేజీ కామెంట్స్..
టాలీవుడ్ హీరోల క్రేజీ కామెంట్స్..

Vijay Wave in Tamil Nadu: తమిళ చిత్రసీమలో తిరుగులేని హీరోగా వెలుగొందిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగస్థలంపై అంతకు మించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. 234 స్థానాలకు గాను ఏకంగా 110 నియోజకవర్గాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయ్ ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టంపై టాలీవుడ్ యువ హీరోలు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఇంట్లో జరిగింది.. ఇప్పుడు పక్కింట్లోనూ
నేచురల్ స్టార్ నాని తనదైన శైలిలో విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. "మొదట సందేహించారు, ఇప్పుడు కిరీటం పెట్టారు. ఇది మా ఇంట్లో (ఏపీలో) జరిగింది, ఇప్పుడు పక్కింట్లోనూ (తమిళనాడులో) జరుగుతోంది. అండర్‌డాగ్ గెలవడం ఎప్పుడూ సినిమా లాంటిదే. తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు" అంటూ నాని చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
విజిల్ పొడు.. విజయ్ అన్నా - సాయి దుర్గా తేజ్
మెగా హీరో సాయి దుర్గా తేజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. "విజిల్ పొడు.. విజయ్ అన్నా, మీ సంకల్పానికి దక్కిన గొప్ప విజయమిది. ఒక నటుడు ప్రజాభిమానంతో అందరినీ తప్పు అని నిరూపిస్తే ఆ కిక్కే వేరు. దక్షిణాదిలో ఇది సాధ్యమని మరోసారి రుజువైంది. తమిళనాడు కోరుకుంటున్న మార్పును మీరు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
నేను ముందే చెప్పాను - శర్వానంద్
హీరో శర్వానంద్ స్పందిస్తూ.. విజయ్ ప్రయాణం ఒక గొప్ప లక్ష్యం కోసమే మొదలైందని తాను ముందే ఊహించానని పేర్కొన్నారు. "సినిమా నుంచి నాయకత్వం వరకు మీరు కోట్లాది మంది నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఈ కీలక ఘట్టంలో మీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను" అని అభినందించారు.
రాజకీయాల్లో కొత్త అధ్యాయం..
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి,
దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటలను బద్ధలు కొడుతూ విజయ్ సాధిస్తున్న ఈ విజయం భారత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ గ్లామర్‌కు ప్రజా సేవ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో విజయ్ నిరూపిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

