Vijay’s ‘Jana Nayagan’: జూలై 23న థియేటర్లలోకి విజయ్ ‘జన నాయగన్’.. టికెట్ల రేట్లు పెంచుతారా?
టికెట్ల రేట్లు పెంచుతారా?

Vijay’s ‘Jana Nayagan’: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటుడిగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి అధికారికంగా తేదీ ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు హీరో విజయ్‌తో పాటు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాయి.
నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9, 2026నే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని చట్టపరమైన చిక్కులు, సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల అన్ని అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి 'A' (అడల్ట్) సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది. సెన్సార్ క్లియరెన్స్ రావడంతో మేకర్స్ ఎలాంటి ఆలస్యం చేయకుండా జూలై 23న కొత్త విడుదల తేదీగా లాక్ చేశారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది అధికారిక తమిళ రీమేక్ కావడం విశేషం. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజూ ఒక కీలక పాత్రలో కనిపించనుంది.
విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత నటుడిగా వస్తున్న చివరి సినిమా ఇది కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆయన నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నటుడిగా కనిపించబోయే చివరి సినిమా ఇదే కావడం, అందులోనూ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా రావడంతో అటు దళపతి అభిమానుల్లో, ఇటు రాజకీయ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో పండుగ వాతావరణం నెలకొంది.

