“డబ్బు కంటే… విజిబిలిటీ ముఖ్యం” షకీల్ కమాండో, ముక్క పాత్రల వెనుక కథ

బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన Dhurandhar 2 సినిమా తర్వాత, ఇందులో నటించిన విక్రమ్ భాంబ్రి (షకీల్ కమాండో), రాజత్ అరోరా (ముక్క) ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. ఈ సినిమా విజయం వాళ్ల కెరీర్‌కు కొత్త దారులు తెరిచింది. ప్రస్తుతం పలు ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వీరికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఉన్న పాత్రల పేర్లు కూడా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాయి. రాజత్ అరోరా చెప్పిన ప్రకారం, ప్రతి పాత్ర పేరు వెనుక ఒక చిన్న కథ ఉంది.

గ్యాంగ్‌లో ఉన్న సభ్యులు ఒకరికి ఒకరు సరదాగా పేర్లు పెట్టుకునే అలవాటు ఉండేదట. ఉదాహరణకు ‘సియాహి’ అనే పాత్రకు ముఖంపై మచ్చలు ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. అలాగే ‘ముక్క’ అంటే పంచ్ అని అర్థం. అంటే ఆ పాత్ర ఎక్కువగా కొట్టేవాడు లేదా కొట్టించుకునేవాడు. ఇలాంటి సరదా టీజ్‌ల నుంచి ఈ పేర్లు వచ్చాయని రాజత్ తెలిపారు. అయితే విక్రమ్ భాంబ్రి చేసిన ‘షకీల్ కమాండో’ పాత్ర మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుందని చెప్పారు.

విక్రమ్ భాంబ్రి ప్రయాణం

విక్రమ్ భాంబ్రి తన కెరీర్ గురించి చెప్పిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన మొదట ఒక MNC కంపెనీలో పనిచేశారట. నటుడిగా మారుతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. 2014 నుంచి ముంబైలో ఉంటున్న విక్రమ్, 2019లో తన స్నేహితుల సూచనతో యాక్టింగ్ వైపు వచ్చారు. ఆయన ఫిజిక్, వాయిస్ బాగుందని చెప్పి ప్రయత్నించమని ఫ్రెండ్స్ ప్రోత్సహించారట. ఆ తర్వాత ఒక థియేటర్ గ్రూప్‌లో చేరి నటనలో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత ఆయనకు Ishq Aaj Kal, Taj: Divided by Blood వంటి ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. కొన్ని అవకాశాలు ఆడిషన్స్ లేకుండానే రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.


రాజత్ అరోరా..స్టేజ్ నుంచి స్క్రీన్ వరకు

రాజత్ అరోరాకు చిన్నప్పటి నుంచే స్టేజ్‌పై ఉండడం అంటే చాలా ఇష్టం. ప్రేక్షకుల మధ్య కూర్చోవడం కంటే స్టేజ్ మీద ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పాటలు, డ్యాన్స్, యాంకరింగ్, నాటకాలు ఇలా వివిధ రంగాల్లో తన ప్రతిభను చూపించారు. ఆయన Kabir Singh సినిమాలో కూడా నటించారు. అదనంగా “Pulse” అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.

“ధురంధర్ 2” తర్వాత అవకాశాలు, సవాళ్లు

ఈ సినిమా తర్వాత అవకాశాలు పెరిగినా, సవాళ్లు కూడా ఉంటాయని విక్రమ్ తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యాక మళ్లీ ఆడిషన్స్, నెట్‌వర్కింగ్ చేయాల్సిందేనని చెప్పారు. ఇదే ఒక నటుడి జీవితం అని పేర్కొన్నారు. పేమెంట్ విషయానికి వస్తే, ప్రారంభంలో పెద్దగా రెమ్యునరేషన్ ఉండదని చెప్పారు. కానీ బాలీవుడ్‌లో ఉన్నాం అనే గుర్తింపు చాలా ముఖ్యం అని తెలిపారు. సరైన ప్రాజెక్టులు ఎంచుకోవడం, మంచి నెట్‌వర్క్ నిర్మించుకోవడం అవసరమని చెప్పారు.

“డబ్బు కాదు… క్రాఫ్ట్ ముఖ్యం”

విక్రమ్, రాజత్ ఇద్దరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. నటుడిగా ఎదగాలంటే డబ్బు కంటే నటనపై దృష్టి పెట్టాలని చెప్పారు. థియేటర్‌లో చాలా మంచి టాలెంట్ ఉన్నా, అక్కడ రెమ్యునరేషన్ తక్కువగా ఉంటుంది. అయినా వారు ప్యాషన్ కోసం పనిచేస్తారని తెలిపారు. క్రాఫ్ట్‌పై ఫోకస్ పెడితేనే కాస్టింగ్ డైరెక్టర్లు మనల్ని గుర్తిస్తారని అన్నారు.


దర్శకుడికి కృతజ్ఞతలు

ఈ సందర్భంగా దర్శకుడు Aditya Dharకు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తమ నటన మరింత మెరుగైందని చెప్పారు. మంచి పారితోషికం ఇచ్చినందుకు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యత్ లక్ష్యాలు

ఇద్దరూ భవిష్యత్తులో విభిన్నమైన పాత్రలు చేయాలని ఆశిస్తున్నారు. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా అభ్యంతరం లేదని చెప్పారు. చిన్న చిన్న పాత్రలు కాకుండా, మంచి లెన్తీ క్యారెక్టర్స్ చేయాలని తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొత్తానికి, “ధురంధర్ 2” సినిమా విజయం విక్రమ్ భాంబ్రి, రాజత్ అరోరా కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. డబ్బు కంటే నటన, కృషి, విజిబిలిటీకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు నటులకు భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.

Updated On 31 March 2026 6:47 PM IST
Lipika Varma

Lipika Varma

Next Story