“మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై”

Bollywood Director Vishal Bhardwaj : ఓ రోమియో’ ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు విశాల్ భర్ద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమా పూర్తి అవడానికి పట్టిన పది సంవత్సరాల ప్రయాణం, షాహిద్ కపూర్‌తో పనిచేసిన అనుభవం, కార్పొరేట్ నిర్మాణ విధానం, సింగిల్ ప్రొడ్యూసర్‌తో పని చేయడం, భారీ బడ్జెట్, నిర్మాత సాజిద్ నడియాద్వాలా మద్దతు, గొడవలు తదితర అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

పది సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే…

ఈ సినిమా హుస్సేన్ జైదీ రాసిన “మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై” పుస్తకం ఆధారంగా రూపొందింది. ఇందులో గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా పాత్రను షాహిద్ కపూర్ పోషించారు.

“నా మిగతా సినిమాలన్నింటిని ఒక వైపున పెట్టినా, మరోవైపు ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. దాదాపు పది సంవత్సరాలు పట్టింది. చివరికి ఇది నిజమైంది. ఈ సినిమా పూర్తవుతుందా లేదా అని ఎన్నో రాత్రులు నిద్రలేక ఆలోచించేవాడిని. ఈ ప్రాజెక్ట్‌పై నాకు చాలా గర్వంగా ఉంది. నా విజన్‌కు అండగా నిలిచిన నిర్మాత సాజిద్ నడియాద్వాలాకు కృతజ్ఞతలు,” అని విశాల్ చెప్పారు.

సినిమా ఆలస్యంపై మాట్లాడుతూ, “స్క్రిప్ట్‌ను ఎన్నిసార్లు రీరైట్ చేశాను. కథలోని క్లిష్టత, హింస, నైతికత, సమాజంలోని ద్వంద్వ వైఖరి వంటి అంశాలు నన్ను ఆకర్షించాయి. ఫరీదా జలాల్, నానా పాటేకర్ లాంటి నటులు తమ పాత్రలకు ఇంటెన్స్ , బలాన్ని ఇచ్చారు,” అని తెలిపారు.

కార్పొరేట్ నిర్మాతలతో పని చేసిన అనుభవం

“ఇది మిశ్రమ అనుభవమే. సృజనాత్మకతను వాణిజ్య ఒత్తిళ్లతో సమతూకం చేయడం ఒక సవాలే. అయినా తుది ఫలితంతో నేను సంతృప్తిగా ఉన్నాను. ఈ సినిమా విజయం మొత్తం టీమ్ అంకితభావానికి నిదర్శనం.

కార్పొరేట్ నిర్మాతతో పని చేయడం వేరు, ఎందుకంటే సాంకేతికంగా సినిమా వాళ్లదే. కానీ ఈ సినిమా నాకు సాజిద్ భాయ్‌తో పనిచేసిన పాత రోజులను గుర్తు చేసింది. ఆయన ఈ సినిమాపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు—నాకన్నా ఎక్కువగానే అనిపించింది. భారీ ఖర్చు అవుతుందనే ఆలోచన లేకుండా మంచి లొకేషన్లు సూచించేవారు. ఆయన నమ్మకం, మద్దతే ఈ ప్రయాణాన్ని సాధ్యం చేసింది,” అన్నారు.

సినిమా హక్కుల విషయంలో స్పష్టత

“‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకానికి సంబంధించిన హక్కులను హుస్సేన్ జైదీ నుంచి తీసుకున్నాం. కథకు సంబంధించిన మూలాంశాలు అక్కడి నుంచే వచ్చాయి. కానీ సినిమా మా స్వంత(ఇంటర్‌ప్రిటేషన్),” అని తెలిపారు.

నటీనటుల ( కాస్ట్ ) మార్పులు ఎందుకు జరిగాయి?

“పది సంవత్సరాలు పట్టడానికి కారణం ఎన్నో స్క్రిప్ట్ వర్షన్లు నచ్చకపోవడమే. అందుకే నటులు మారుతూ వచ్చారు. మొదట కథానాయకుడి పాత్ర వేరేలా ఉండేది. కాలక్రమంలో కథ పాతబడినట్లు అనిపించింది, కానీ ఏదో ఒకటి నన్ను వదలలేదు. అందుకే ప్రతి డ్రాఫ్ట్‌ను మార్చుతూ వచ్చాను. ఇది నాకు దర్శకుడిగా చాలా ముఖ్యమైన సినిమా అయింది,” అని చెప్పారు.

విశాల్ చెప్పిన రహస్యం

“చాలామంది దర్శకులు ఈ కథను నా దగ్గర నుంచి తీసుకోవాలని చూశారు. కానీ నేను చాలా పట్టుదలగా ఉండిపోయాను. బడ్జెట్ భారీగా పెరుగుతూనే ఉంది, నా విజన్ విస్తరిస్తూనే ఉంది. ఇది సాజిద్ భాయ్ మద్దతుతోనే సాధ్యమైంది.”

సినిమా – సమాజానికి అద్దం | బూతు డైలాగ్స్ వాడటం

“ఇది హింసాత్మక నేపథ్యంతో నడిచే జీవంతో నిండిన కథ. సమాజంగా మనం ద్వంద్వ వైఖరి చూపిస్తాం. సినిమా అద్దంలాంటిది—అసౌకర్యకరమైన నిజాలను చూపిస్తుంది. హింస ఉంది, అలాంటి పాత్రలు నిజ జీవితంలో మాట్లాడేలా బూతులు కూడా ఉంటాయి. వాటిని ‘బీప్’ చేసి చూపించడం నాకు ఇష్టం లేదు. బూతులు కూడా పొయటిక్ గా ఉంటే ప్రజలు స్వీకరిస్తారు,” అన్నారు.

ఫరీదా జలాల్‌పై ప్రత్యేక ప్రశంసలు

“ఫరీదా జలాల్‌తో పనిచేయడం ఇదే తొలిసారి. ఆమె చేసిన ‘దాది’ పాత్ర సినిమాలో అత్యంత బలమైన పాత్రల్లో ఒకటి. మహిళలు సహజంగానే బలంగా ఉంటారు. ఆమె ఈ పాత్రను పూర్తిగా స్వంతం చేసుకున్నారు. ఆమెకు మేం చాలా కృతజ్ఞులం,” అన్నారు.

షాహిద్ కపూర్‌ను అర్థం చేసుకున్నాను

“ఇప్పుడు షాహిద్‌ను బాగా అర్థం చేసుకున్నాను. నాకు ఏది నచ్చుతుందో అతనికి తెలుసు. నటుడిగా, సహకారిగా అతను ఎంతో పరిపక్వత సాధించాడు. ఈ సినిమాకు అతని కృషి చాలా గొప్పది—కానీ అతన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టం,” అంటూ నవ్వారు.

నానా పాటేకర్‌పై వ్యాఖ్య

ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి నానా పాటేకర్ మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోగా, హీరో షాహిద్ కపూర్ మరియు త్రిప్తి దిమ్రి చేతిలో చేయి వేసుకుని 1.30కి వచ్చారు. దీనిపై నానా అసహనం వ్యక్తం చేస్తూ వేదికను విడిచిపెట్టారు.

దీనిపై విశాల్ భర్ద్వాజ్ స్పందిస్తూ,

“నానా అందరినీ ఆట పట్టిస్తాడు అదే సమయంలో అందరినీ అలరించే అల్లరి విద్యార్థిలాంటివాడు. మేం 27 ఏళ్లుగా స్నేహితులం. తనదైన స్టైల్లో లేచి కూల్‌గా వెళ్లిపోయాడు. మేం అతన్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం—నానా అంటే నానానే,” అన్నారు.

Updated On 23 Jan 2026 12:40 PM IST
Lipika Varma

Lipika Varma

Next Story