Amala Paul: సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను అభ్యంతరకరంగా తెరకెక్కించడంపై చిత్ర పరిశ్రమను మాత్రమే తప్పుపట్టలేమని, అది పూర్తిగా ఆయా దర్శకులు, చిత్ర యూనిట్ ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుందని ప్రముఖ కథానాయిక అమలాపాల్ స్పష్టం చేశారు. కొచ్చి వేదికగా నిర్వహించిన ఓ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆమె, దక్షిణాది చిత్రసీమలో మహిళల ప్రాధాన్యత, తన 15 ఏళ్ల సినీ ప్రయాణంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చిత్ర పరిశ్రమలో మార్పు మొదలైంది

కొందరు దర్శకుల విధానాల వల్ల మొత్తం సినీ రంగానికే మచ్చ రావడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దక్షిణాది సినీ రంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, అన్ని భాషల్లోనూ మహిళా ప్రాధాన్యమున్న కథలకు ప్రేక్షకాదరణ పెరుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. సమస్య అనేది పరిశ్రమది కాదని, అది కేవలం ఆ ఒక్క సినిమా లేదా ఆ దర్శకుడి దృక్పథానికే పరిమితమని ఆమె వివరించారు.

మూస పాత్రలకు భిన్నంగా నా ప్రయాణం

తన 15 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటూ, విలక్షణమైన కథలకే ప్రాధాన్యమిచ్చినట్లు అమలాపాల్ తెలిపారు. కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తూనే తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించానని చెప్పారు.

ఆమె నా కెరీర్‌లోనే పెద్ద సాహసం.. కానీ ఇప్పుడు చేయలేను..

2019లో వచ్చిన ఆడై (తెలుగులో ‘ఆమె’) సినిమా తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ పాత్ర చేసే సమయంలో వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుందేమోనని, అలాంటి కథలే వరుసగా వస్తాయేమోనని తీవ్ర ఆందోళన చెందానని తెలిపారు. వెనక్కి తిరిగి చూసుకుంటే అదొక డేరింగ్ స్టెప్ అనిపించినప్పటికీ, "ప్రస్తుతం నన్ను అలాంటి సినిమా చేయమంటే కచ్చితంగా చేయలేకపోవచ్చు" అని కుండబద్దలు కొట్టారు.

సినిమా రంగంలో మహిళలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, భవిష్యత్తులో పరిశ్రమలో మహిళలకు మరింత అనుకూలమైన, గౌరవప్రదమైన వాతావరణం ఏర్పడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Next Story