Chiranjeevi's Emotional Tribute: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, అసాధారణ స్క్రీన్‌ప్లే రచయిత, దర్శకుడు భాగ్యరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి వార్త విన్న సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పిస్తున్నారు.

గోవా వేడుకల్లో కలిశాం.. ఇంతలోనే ఇలా: మెగాస్టార్ చిరంజీవి ఆవేదన

భాగ్యరాజ్ మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యరాజ్ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. "భాగ్యరాజ్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నా గుండె ఆవేదనతో నిండిపోయింది. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. నిన్న కాక మొన్ననే గోవాలో జరిగిన నటి కుష్బూ కుటుంబ వివాహ వేడుకలో మేమంతా కలిశాం. అక్కడ భాగ్యరాజ్ గారితో కలిసి ఎంతో ఉల్లాసంగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఫొటోలు దిగాం. అంతలోనే ఈ రోజు ఉదయం ఆయన మరణ వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు.

భారతీయ సినిమాకు తీరని లోటు..

భాగ్యరాజ్ సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడిన చిరంజీవి.. "ఆయన ఒక గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయిత, అద్భుతమైన నటుడు. భారతీయ సినిమా రంగానికి ఆయన అందించిన కృషి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు" అని కొనియాడారు.

చివరగా భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. ఈ కష్టసమయంలో ఆయన భార్య పూర్ణిమ, కూతురు, కుమారుడికి ఆ భగవంతుడు గుండె నిబ్బరాన్ని, ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని చిరంజీవి ప్రార్థించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story