Hero Suhas: యువ నటుడు సుహాస్, కోలీవుడ్ స్టార్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా స్పోర్ట్స్ డ్రామా మండాడి. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్లలో భాగంగా సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను, ప్రాణాపాయ సంఘటనలను పంచుకున్నారు. సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ భాగాన్ని దాదాపు 45 రోజుల పాటు ఏకధాటిగా నడిసముద్రంలోనే చిత్రీకరించారు. ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. "కెరీర్‌లో ఇంతటి ప్రమాదకరమైన షూటింగ్ ఎప్పుడూ చేయలేదు. ఆ అలల మధ్య ప్రాణాల విలువ తెలిసొచ్చింది. షూటింగ్ పూర్తవగానే ప్రాణాలతో బయటపడ్డామంటూ ఆ సముద్రానికే చేతులెత్తి మొక్కుకున్నాను" అని సుహాస్ తెలిపారు.

బోట్లు బోల్తా.. కెమెరామెన్లు నీటిపాలు

షూటింగ్ జరుగుతున్న సమయంలో మూడు నాలుగు సార్లు పరిస్థితి అత్యంత విషమంగా మారిందని ఆయన వెల్లడించారు. బోట్లు బోల్తా పడి యూనిట్ సభ్యులు, చివరకు కెమెరామెన్లు కూడా సముద్రంలో పడిపోయిన క్షణాలు ఇప్పటికీ కళ్లముందు కదులుతున్నాయని చెప్పారు. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు చేయడంతో చిత్ర బృందం మొత్తం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిందని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో ఇంతటి రిస్క్ ఉన్న ప్రాజెక్టులు మళ్లీ చేయబోనని, ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రపంచం.. సరికొత్త పాఠం

సముద్రంలో ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో చిత్ర యూనిట్‌తో గడపడం ద్వారా వ్యక్తుల మధ్య బంధాలు బలపడ్డాయని, ఈ సినిమా తనలో భయాన్ని పూర్తిగా పోగొట్టి కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని సుహాస్ అన్నారు. తమిళ నటుడు సూరి గురించి చెబుతూ.. ఆయన సెట్స్‌లో ఎంతో కలుపుగోలుగా ఉంటూ అందరినీ ఎప్పుడూ నవ్విస్తూ ఉత్సాహపరిచారని కొనియాడారు.

Next Story