TGFDC : ఫిల్మ్ షూటింగులకు గమ్య స్ధానంగా తెలంగాణను మారుస్తాం
స్టేక్‌హోల్డర్లతో సమావేశంమైన స్పెషల్ సీఎస్ జయేష్‌రంజన్, దిల్‌రాజు

తెలంగాణ రాష్ట్రాన్ని సినిమా షూటింగులకు అత్యంత స్నేహపూర్వక వాతావరణం కలిగిన ప్రాంతంగా, సినిమాలకు తక్కువ పెట్టుబడులతో అత్యంత లాభదాయకమైన గమ్యస్ధానంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ఫిలింమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రణాళికలు తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం తాజ్ కృష్ణాలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టావెల్, హాస్పిటాలిటీ, ఏవియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర రంగాల నంచి దాదాపు 40 మంది స్టేక్ హోల్డర్లు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్‌ల ఆధ్వర్యంలో తెలంగాణలో ఎంఐసీఈ, సినిమా, పర్యాటక రంగాలను బలోపేతం చేయడంతో పాటు ఆయా రంగాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించారు. ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాన MICE పర్యాటక కేంద్రంగా మార్చడంపై దృష్టి సారించేందుకు గాను ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర MICE పర్యాటక ప్రొఫైల్ అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. పరిశ్రమ స్టేక్ హోల్డర్లతో పాటు, ఈ సమావేశంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ , TGTDC MD వల్సూరు క్రాంతి, సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక లు కూడా పాల్గొన్నారు. ఈ అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఆగస్టు చివరి నాటికి లేదా ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27, 2025) నాటికి ప్రకటించ జరుగుతుందని జయేష్ రంజన్ ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారితో కలిసి ఫిల్మ్ టూరిజం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM) గచ్చిబౌలి కు సంబంధించి స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫిల్మ్ స్టూడియోలు, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్, ఫారెస్ట్, ఎండోమెంట్స్ ,హెరిటేజ్ తెలంగాణ వంటి ప్రభుత్వ విభాగాల నుండి దాదాపు ఇరవై మంది ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఉత్తమ పాలసీలపై చర్చించారు. సింగిల్ విండో వ్యవస్థలో అన్ని సినిమా షూటింగ్ అవసరాల కోసం "ఫిల్మ్ ఇన్ తెలంగాణ" పోర్టల్ అభివృద్ధిని "వన్ స్టాప్ షాప్"గా అభివృద్ధి చేయడంతో సహా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని తెలిపారు..
