Producer Abhishek Nama: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నాగబంధం చిత్ర దర్శకుడు అభిషేక్ నామ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడిగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, గతంలో విజయ్ దేవరకొండ సినిమా వల్ల తాము ఎదుర్కొన్న నష్టాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆయన బహిరంగంగా పంచుకున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్ తెచ్చిన నష్టాలు

గతంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా అభిషేక్ నామ వ్యవహరించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్‌గా తమకు భారీగా నష్టాలు వచ్చాయని అభిషేక్ నామ ఈ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

రూపాయి అడగలేదు.. కానీ మూడేళ్లుగా ఎదురుచూపులే..

ఈ వివాదంపై అభిషేక్ నామ మాట్లాడుతూ.. "ఆ సినిమా వల్ల మాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పటికీ, మేము విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదు. కానీ, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మా బ్యానర్‌లో ఆయన మరో సినిమా చేస్తారని ఆశించాం. దానికోసం ఏకంగా మూడేళ్ల పాటు ఎదురుచూశాం. అయినా సరే ఆయన నుండి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు" అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి హీరోలు మరో సినిమా చేయడం ఇండస్ట్రీలో ఒక పద్ధతిగా వస్తోంది. అయితే విజయ్ దేవరకొండ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాను ఈ విషయాలను పంచుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరి నిర్మాత అభిషేక్ నామ చేసిన ఈ వ్యాఖ్యలపై హీరో విజయ్ దేవరకొండ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story