Prime Minister Modi Tell Ram Charan: ప్రధాని మోదీ రామ్ చరణ్ కు ఏం చెప్పారు..పెద్ది కథ అదేనా.?
పెద్ది కథ అదేనా.?

Prime Minister Modi Tell Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాల్లో సందడి చేసిన చిత్ర బృందం.. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయింది. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బ్యూటిఫుల్ జాన్వీ కపూర్, సీనియర్ నటుడు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు పాల్గొని సందడి చేశారు.
ఈ ప్రెస్‌మీట్‌లో రామ్‌చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీని చరణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "నేను దిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ఆయన నన్ను ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. ఓ రకంగా ఇది వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని నేను ఆయనకు వివరించాను. అప్పుడు పిఎం మోదీ నాతో ఒక స్ఫూర్తినింపే నిజ జీవిత కథను పంచుకున్నారు" అని చరణ్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మహ్మద్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ ఉండేవాడని, కొన్నేళ్ల క్రితం అతను భారత్ తరఫున ఆడి తన ఊరికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడని మోదీ గారు చెప్పారు. ఆ ఒక్క వ్యక్తి చూపించిన ప్రభావం వల్ల.. ఈరోజు ఆ చిన్న గ్రామం నుంచి ఏకంగా 85 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ తయారయ్యారు. ఒక్క వ్యక్తి సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలడు అనడానికి ఇదొక నిదర్శనం. మన ‘పెద్ది’ సినిమాలో చరణ్ పోషించిన పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే" అంటూ సినిమాపై అంచనాలను పెంచేశారు రామ్‌చరణ్. ఇక ప్రెస్‌మీట్‌లో.. సినిమాలో అంత బాగా ఎలా డ్యాన్స్ చేశారు? అని అడగ్గా.. "నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారు" అంటూ చరణ్ నవ్వులు పూయించారు.
మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సినిమా విశేషాలను పంచుకున్నారు. "స్క్రీన్ మీద కనిపించే రామ్‌చరణ్‌కు, బయట ఉండే చరణ్‌కు అస్సలు పోలిక ఉండదు.. ఆయన రియల్ లైఫ్‌లో చాలా కూల్‌గా ఉంటారు" అని చెప్పారు. అలాగే లెజెండరీ యాక్టర్ బొమన్ ఇరానీతో కలిసి నటించాలనే తన డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరిందని, డైరెక్టర్ బుచ్చిబాబు ఏం చెబితే తాను అదే ఫాలో అయ్యానని, చిత్ర యూనిట్ అంతా ఆయనకు ఫ్యాన్స్ అయిపోయామని జాన్వీ అన్నారు.

